అంత్యక్రియలకు వచ్చి.. ప్రమాదం బారిన
జలదంకి : కర్నూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఒకే కుటుంబంలోని గోళ్ల రమేశ్, అనూష, వీరి బిడ్డలు శశాంత్, మన్వితల అంత్యక్రియలు సోమవారం నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లెలో జరిగాయి. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొని తిరుగుముఖం పట్టిన మృతుల బంధువులు ప్రమాదం బారిన పడ్డారు. విజయవాడకు చెందిన గోళ్ల కృష్ణచైతన్య, సుంచు సుమలత, పులిపాటి నాగమౌనిక, నల్లబోతు భానుప్రియ, డ్రెవర్ వర్రి శ్రీనివాస్‌లు ఈ అంత్యక్రియల్లో పాల్గొని కారులో తిరుగుముఖం పట్టారు. కావలి వైపు వస్తుండగా చినక్రాక, హనుమకొండపాలెం గ్రామాల మధ్య కారు ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టు గోడను ఢీకొట్టింది. కారు ముందు భాగం దెబ్బతినగా కారులో ఉన్న ఐదుగురికీ గాయాలయ్యాయి. సమీపంలోని వాహనదారులు వెంటనే స్పందించి గాయపడిన ఐదుగురిని 108 వాహనంలో కావలి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం వారు విజయవాడ వెళ్లారు.









Comments