• Oct 05, 2025
  • NPN Log

    హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య రెండేళ్ల వ్యఽవధిలో 17శాతం పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 2023 వరకు రోజూ సగటున ప్రైవేటు ఆస్పత్రుల్లో 800-950 మధ్య ఆరోగ్యశ్రీ కేసులు రాగా... ప్రస్తుతం ఆ సంఖ్య 1150-1200కు పెరిగింది. సర్కారీ దవాఖానాల్లోని ఆరోగ్యశ్రీ కేసులను కూడా కలిపితే అది 2200 వరకు వస్తున్నట్లు వైద్య శాఖ పేర్కొంది. ఆరోగ్య శ్రీ పరిధిలోకికొత్తగా మరో పది లక్షల కుటుంబాలు రాగా.. మొత్తం కుటుంబాల సంఖ్య 99.50లక్షలకు చేరింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు రూ.12,890 కోట్లు ఖర్చు పెట్టింది. లబ్ధిదారులు, పెరిగిన ప్రొసీజర్ల సంఖ్య, నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, పెట్టిన ఖర్చు తదితర అంశాలపై తాజాగా ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో 2014 నుంచి ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో చోటుచేసుకున్న మార్పులను వివరించింది. ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎ్‌స కింద ఇప్పటిదాకా మొత్తం 52.97 లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకున్నట్లు వెల్లడించింది.

    ఏటా పెరుగుతోన్న రోగులు, ఆస్పత్రులు...

    2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. నాడు ఒక్కో కుటుంబానికి వైద్య చికిత్సల పరిమితి రూ.2 లక్షలుగా నిర్ణయించగా.. ఉమ్మడి రాష్ట్రంలో 79 లక్షల కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. మొత్తం 120 ఎంప్యానెల్‌ ఆస్పత్రులు ఉండగా, ఈ పథకం కింద 533 ప్రొసీజర్లు ఉండేవి. 2012లో ఆరోగ్యశ్రీలోని ప్రొసీజర్ల సంఖ్యను 898కు పెంచగా, ఎంప్యానెల్‌ ఆస్పత్రుల సంఖ్య కూడా 338కి పెరిగింది. ఇక, తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించింది. 2014 నాటికి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య 87.5 లక్షలుగా ఉంది. 2016లో కేసీఆర్‌ ప్రభుత్వం మరో 91 ప్రొసీజర్లను ఆరోగ్య శ్రీలోకి చేర్చింది. బడ్జెట్‌ను సైతం రూ.423 కోట్లకు పెంచింది. ఆతర్వాత 2021 నాటికి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను 1356కి పెంచడంతోపాటు మరో 3 లక్షల కుటుంబాలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. వైద్య చికిత్సల పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచడంతోపాటు బడ్జెట్‌ను రూ.973కోట్లకు పెంచింది. ప్రొసీజర్ల సంఖ్యను 1672కు పెంచింది.

    కాంగ్రెస్‌ సర్కారు వచ్చాక మరిన్ని మార్పులు.

    2023 చివరిలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక వైద్య చికిత్సల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచారు. గత ఏడాది జూలైలో కొత్తగా మరో 163 ప్రొసీజర్లను పథకం పరిధిలోకి తెచ్చారు. దీంతో మొత్తం ప్రొసీజర్ల సంఖ్య 1835కు చేరింది. ఎంప్యానెల్‌ ఆస్పత్రుల సంఖ్య 1502కు పెరిగింది. అలాగే, ఆరోగ్యశ్రీ బడ్జెట్‌ను రూ.1443 కోట్లకు పెంచారు. లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య 99.50 లక్షలకు చేరింది. ఇక 2022-23లో 5.59 లక్షల మంది శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. 2023-24లో 6.21 లక్షలు, 2024-25లో 6.57 లక్షలు, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు 3.02లక్షల మంది వైద్య సేవలు పొందారు. పరిమితి పెంచడంతో పాటు ప్రొసీజర్లు, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్య పెంచడం వల్లే ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎ్‌స) కింద 5.46 లక్షల మంది వైద్య చికిత్సలు పొందారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement