ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్‌కు 60 శాతం వాటా
న్యూఢిల్లీ: భారత బ్యాంకింగ్ రంగంలో బడా డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో యూఏఈకి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్ ఎమిరేట్స్ ఎన్‌బీడీ బ్యాంక్ 60 శాతం వాటాను రూ.26,853 కోట్ల (300 కోట్ల డాలర్లు)కు కొనుగోలు చేయనుంది. ఈ కొనుగోలు పూర్తయితే భారత ఆర్థిక రంగంలో విలువపరంగా ఇదే అతిపెద్ద డీల్ కానుంది. అంతేకాదు దేశీయ ఆర్థిక సేవల రంగంలో భారీ విదేశీ ప్రతక్ష్య పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కూడా ఇదే అవుతుంది. సెప్టెంబరు త్రెమాసిక ఆర్థిక ఫలితాలను బోర్డు ఆమోదించిన సందర్భంగా ఎన్‌బీడీ బ్యాంక్ కొనుగోలు ప్రతిపాదనను ఆమోదించిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఆర్‌బీఎల్ బ్యాంక్ తెలిపింది. రూ.10 ముఖ విలువతో కలిగిన ఒక్కో షేరును రూ.280 ధరతో మొత్తం 95.90 కోట్ల షేర్లను ప్రిఫరెన్షియల్ ఇష్యూ ప్రాతిపదికన 60 శాతం వాటాను రూ.26,853 కోట్ల కు ఎన్‌బీడీకి కేటాయించేందుకు శనివారం బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఎన్‌బీడీ బ్యాంక్ విదేశీ సంస్థ కావటంతో రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఈ డీల్ ఉంటుందని తెలిపింది. కాగా ఈ ఏడాది యస్ బ్యాంక్‌లో జపాన్‌కు చెందిన ఎస్‌ఎంబీసీ 24.9 శాతం వాటాలను రూ.16,333 కోట్లకు చేజిక్కించుకున్న సంగతి విదితమే.
Comments