ఆసియా కప్ 2025 హీరో డకౌట్
ఇటీవల జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరు. ఎందుకుంటే.. ఆ మ్యాచ్ ఇచ్చిన కిక్కు ఆ రేంజ్ లో ఉంది. మ్యాచ్ భారత్ ఓడిపోతుందేమోనని తీవ్ర నిరాశలో ఉన్న భారతీయ క్రికెట్ అభిమానులకు నేను ఉన్నానంటూ కేజీఎఫ్ లో హీరో మాదిరిగా హైదరాబాద్ డైమండ్ తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ ను భారత్ వశం చేసే వరకు అతడు విశ్రమించలేదు. చివరకు భారత్ కు ట్రోఫీ అందించి..టోర్నీలోనే హీరోగా నిలిచాడు తిలక్ వర్మ. ఈ స్టార్ బ్యాటర్ తాజాగా జరిగిన దేశవాళీ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మరి.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో లైట్ గ్రూప్-డీలో భాగంగా హైదరాబాద్, ఢిల్లీ జట్ట మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ సిల్వర్ డక్‌గా వెనుదిరిగి తీవ్రంగా నిరాశపర్చాడు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన తిలక్ వర్మను పరుగుల ఖాతను ఓపెన్ చేయనివ్వకుండానే ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. దాంతో హైదరాబాద్ జట్టు బంతి వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి టాక్ ఆఫ్ ది నేషన్‌గా నిలిచిన తిలక్ వర్మ ఆ జోరును రెడ్ బాల్ ఫార్మాట్లో కొనసాగించలేకపోయాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు ముందు తిలక్ ఆడే ఏకైక రంజీ మ్యాచ్‌లో విఫలమవడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 151 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 529 పరుగుల భారీ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. ఆయుష్ దోసేజ(209 నాటౌట్), సనత్ సంగ్వాన్(211 నాటౌట్) అజేయ ద్విశతకాలతో చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోర్ సాధించింది. హైదరాబాద్ బౌలర్లలో చామ మిలింద్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. పున్నయ్య ఓ వికెట్ పడగొట్టాడు. హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఢిల్లీ బౌలర్లకు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఐదు వికెట్ల నష్టానికి 330 పైనే పరుగులు చేసింది. ఈ రోజే చివరి రోజు కావడంతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Comments