ఇటలీలో దారుణం.. గురుద్వారా ఎదుట ఇద్దరు భారతీయుల దారుణ హత్య..
ఇటలీలోని కోవోలో ఇద్దరు భారతీయులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ వ్యక్తి వారిని తుపాకితో కాల్చి చంపాడు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లా సిసిలియా న్యూస్ పేపర్ తెలిపిన వివరాల మేరకు.. కోవోకు చెందిన రాజిందర్ సింగ్, ఆంగడెల్లోకు చెందిన గుర్మిత్ సింగ్ శుక్రవారం రాత్రి బెర్గామో ప్రానిన్స్‌లోని వేర్‌హౌస్‌లో వైశాఖి పండుగ సందర్భంగా ప్రార్థనలు చేసి బయటకు వచ్చారు. గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ ఎదుట ఆ ఇద్దరికీ మరో భారతీయుడితో గొడవైంది.
ఆ గొడవ చిలికిచిలికి గాలి వానలా మారింది. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి తుపాకితో రాజిందర్ సింగ్, గుర్మిత్ సింగ్‌లపై కాల్పులు జరిపాడు. ఆ వెంటనే కారులో అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రగాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గొడవతో సంబంధం లేని మరో వ్యక్తికి కూడా బుల్లెట్లు తగిలాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో పోలీసులకు బుల్లెట్లకు సంబంధించిన 10 ఖాళీ షెల్స్ దొరికాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఆ ఇద్దరినీ హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.









Comments