• Apr 07, 2026
  • NPN Log

    టెల్ అవీవ్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఈ తెల్లవారుజామున ఇరాన్, లెబనాన్‌లలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని భారీ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇరాన్‌లోని 200 కంటే ఎక్కువ, లెబనాన్‌లోని హెజ్బొల్లాకు చెందిన 140కి పైగా స్థావరాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

    ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో ఇజ్రాయెల్ వాయుసేన అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించింది. వీటిలో ప్రధానంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఆయుధాగారాలను ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. క్షిపణి వ్యవస్థలు నాశనం చేసింది. విమానాలను కూల్చివేసేందుకు ఉపయోగించే బాలిస్టిక్ క్షిపణుల తయారీ, నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ తెలిపింది. ఇరాన్ రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.

     

    లెబనాన్‌లో హెజ్బొల్లాకు గట్టి దెబ్బ

    మరోవైపు లెబనాన్‌లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థను అణిచివేసేందుకు ఇజ్రాయెల్ తన దాడులను తీవ్రతరం చేసింది. రాద్వాన్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ పై విరుచుకుపడింది. హెజ్బొల్లాకు చెందిన అత్యంత శక్తివంతమైన 'రాద్వాన్ ఫోర్స్' ప్రధాన కార్యాలయాలను ఇజ్రాయెల్ నేలమట్టం చేసింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే శిబిరాలు, ఆయుధ నిల్వ గిడ్డంగులు, రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.

    ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందన

    ఈ దాడుల అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ, ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని వేగంగా కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఇరాన్ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు 70 శాతం ఇప్పటికే ధ్వంసమైందని, దీనివల్ల వారు కొత్త ఆయుధాలను తయారు చేసే శక్తిని కోల్పోతారని ఆయన పేర్కొన్నారు. అమెరికా మద్దతుతో తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. 'మేము ఇరాన్ ఉగ్రవాద పాలనను అణిచివేస్తున్నాం. వారి కమాండర్లను మట్టుబెడుతూ, వారి ఆర్థిక, సైనిక మౌలిక సదుపాయాలను కూలుస్తున్నాం.' అని ఆయన ప్రకటించారు.

    ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ పరిస్థితిని మరింత జటిలం చేశాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా కువైట్, ఇతర ప్రాంతాలలో కూడా డ్రోన్ దాడులు జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement