• Apr 19, 2026
  • NPN Log

    హైదరాబాద్‌ : ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వర్‌రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ‘అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (ఏఐఎంబీఈ) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్’కు ఆయన ఎంపికయ్యారు. పరిశోధన, ఆవిష్కరణ రంగాలతో పాటు వాటి ఫలితాలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు విశిష్ట కృషి చేసినవారికి ఈ గౌరవం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య, జీవ వైజ్ఞానిక రంగంలోని ఇంజనీర్లలో టాప్‌ 2 శాతం మందికే ఈ గౌరవం దక్కుతుంటుంది. వారిలో నోబెల్‌, అమెరికా నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ గ్రహీతలు, ప్రముఖ శాస్త్రీయ అకాడమీల సభ్యులు కూడా ఉన్నారు. ‘ఏఐఎంబీఈ కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్‌’ ప్రపంచ ఆరోగ్య విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తుంది. విధాన నిర్ణేతలు, పరిశోధన సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి గ్యాస్ట్రోఎంటరాలజీ రంగంలో గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ ఎండోస్కోపీని నిర్ధారణ పరికరం స్థాయి నుంచి శక్తివంతమైన చికిత్సా సాధనంగా మార్చిన వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన ముఖ్య ఆవిష్కరణల్లో ‘నగి స్టెంట్‌’ ఒకటి. ఇది గ్యాస్ట్రోఇంటెస్టినల్‌ చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి స్పందిస్తూ ‘ఏఐఎంబీఈ కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్’కు ఎంపిక కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం మనం వైద్య రంగంలో కీలక మార్పుల దశలో ఉన్నామన్నారు. క్లినికల్‌ అనుభవం, ఇంజనీరింగ్‌ నైపుణ్యం, పెరుగుతున్న ఏఐ సామర్థ్యాల ఆధారంగా స్వదేశీ వైద్య సాంకేతికతలను అభివృద్ధి చేయాలన్నారు. అప్పుడు ఆరోగ్య సేవల విధానాన్ని భారత్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా మార్చగలమని పేర్కొన్నారు. దీనికి వైద్యులు, వైద్య సిబ్బంది, ఇంజనీర్లు, విద్య, పరిశోధన రంగాల ప్రతినిధులు, పరిశ్రమ, విధాన నిర్ణేతలు కలిసి పనిచేసే సమగ్ర వ్యవస్థ అవసరమని సూచించారు. పరిశోధనలకు పెట్టుబడులు, ఇతర మద్దతు లభించేలా వేదికలు ఉండాలని, అప్పుడే ఆవిష్కరణలను విస్తృతస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా చేయగలుగుతామని పేర్కొన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement