• Apr 19, 2026
  • NPN Log

    ఏఐ వినియోగానికి సంబంధించి తాజాగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. కంపెనీలు ఇచ్చిన ఏఐ సాధనాలను అనేక మంది ఉద్యోగులు పక్కనపెట్టేస్తూ మునుపటి లాగే స్వయంగా పనులు చేస్తున్నారని తెలిసింది. ఎస్‌ఏపీ అనుబంధ సంస్థ వాక్‌మీ నిర్వహించిన ఈ సర్వే వివరాలు తాజాగా ఒక అంతర్జాతీయ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇది ఏఐపై ఉద్యోగులు మౌనంగా చేస్తున్న తిరుగుబాటు అని అధ్యయనకారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏఐని ఉత్పాదకత పెంచే సాధనంగా కంటే తమ పాత్రను తగ్గించే సాంకేతికతగా అధిక శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నట్టు సర్వేలో తేలింది. 14 దేశాల్లో మొత్తం 3,750 మంది ఉన్నతాధికారులు, ఉద్యోగులతో ఈ సర్వేను నిర్వహించారు.

    ఈ రిపోర్టు ప్రకారం, 54 శాతం మంది వర్కర్లు తమ కంపెనీలు ఇచ్చిన ఏఐ సాధనాలను వినియోగించకుండా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో 33 శాతం మంది అసలు ఎలాంటి ఏఐని వాడకుండా పనులు చేసుకుంటున్నారు. దీంతో, ప్రతి 10 మందిలో 8 మంది ఉద్యోగులు ఏఐని తిరస్కరించినట్టైందని సర్వే అభిప్రాయపడింది.

     

    ఏఐపై విశ్వాసం విషయంలో ఉద్యోగులు, ఉన్నతాధికారుల అభిప్రాయాల్లో అంతరాలు ఉన్నట్టు కూడా ఈ సర్వేలో బయటపడింది. కీలకమైన, సంక్లిష్టమైన బాధ్యతలను ఏఐకి అప్పగించవచ్చని 61 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడగా కేవలం 9 శాతం మంది వర్కర్లే ఈ అభిప్రాయంతో ఉన్నారు. ఉద్యోగులకు కావాల్సిన ఏఐ టూల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయని 88 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు భావించగా కేవలం 21 శాతం మంది వర్కర్లు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

    ఏఐ వినియోగంతో పాటు లేఆఫ్స్ పెరుగుతుండటంతో ఉద్యోగుల్లో అనుమానాలు పెరుగుతున్నాయని కూడా సర్వే తేల్చింది. ముఖ్యంగా మధ్యవయసుకు వచ్చిన ప్రొఫెషనల్స్ ఏఐ విషయంలో వెనకడుగు వేస్తున్నారు. తమ బాధ్యతలను ఏఐ చేయగలదని అనేక మందికి ఇప్పటికే స్పష్టంగా అర్థమైనట్టు సర్వేలో తేలింది.

    ఇదిలా ఉంటే కంపెనీలు మాత్రం ఏఐ వినియోగాన్ని అంతకంతకూ పెంచుతున్నాయి. భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయి. కానీ, ఏఐ వినియోగం తక్కువగా ఉండటంతో 40 శాతం పెట్టుబడుల విషయంలో పూర్తిస్థాయి ప్రతిఫలం దక్కట్లేదని కూడా సర్వే తేల్చింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement