ఏప్రిల్ కు వెళ్ళిపోయిన 'ఆల్ఫా'
కొంతకాలంగా బాలీవుడ్ లో వార్త చక్కర్లు కొడుతోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న స్పై యూనివర్శ్ మూవీ 'ఆల్ఫా' ఈ యేడాది క్రిస్మస్ కు రావడం లేదన్నదే ఆ వార్త. దానిని నిజం చేస్తూ నిర్మాణ సంస్థ సోమవారం 'ఆల్ఫా' కొత్త విడుదల తేదీని ప్రకటించింది. ముందుకు అనుకున్నట్టుగా ఈ యేడాది క్రిస్మస్ కు తమ చిత్రాన్ని విడుదల చేయడం లేదని, వచ్చే యేడాది ఏప్రిల్ 17న గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని యశ్ రాజ్ ఫిలిమ్స్ అధికార ప్రతినిధి తెలిపారు. ఆదిత్య చోప్రా ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను శివ్ రావెల్ డైరెక్ట్ చేస్తున్నారు.
 
యశ్ రాజ్ ఫిలిమ్స్ నెట్ ఫ్లిక్స్ కోసం నిర్మించిన 'ది రైల్వే మెన్' వెబ్ సీరిస్ ను శివ్ రావెల్ తెరకెక్కించారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ నేపథ్యంలో వచ్చిన ఆ వెబ్ సీరిస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక 'ఆల్ఫా' విషయానికి వస్తే వీఎఫ్ఎక్స్ పనులు అనుకున్న సమయంలో పూర్తి కాలేదని, అందుకోసమే సినిమా విడుదల తేదీని వాయిదా వేశామని యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ తెలిపింది. యశ్ రాజ్ స్పైవర్శ్ లో తాజాగా వచ్చిన 'వార్ 2' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడం కూడా 'ఆల్ఫా' రిలీజ్ వాయిదా పడటానికి ఒక కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి తొలిసారి నటించిన 'వార్ 2' భారీ అంచనాలతో విడుదలైంది. కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడం ఇద్దరి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. 'ఆల్ఫా'లో ఆలియా భట్, శార్వరి సూపర్ ఏజెంట్స్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
 
                     
                              
  






 
 
Comments