మోహన్ బాబును ఘనంగా సత్కరించనున్న తనయుడు విష్ణు
ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు చిత్రసీమలోకి అడుగుపెట్టి యాభై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసేలా ఓ గ్రాండ్ ఈవెంట్ ను మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్లాన్ చేశారు. నవంబర్ 22న 'ఎం.బి. 50: ఎ పెరల్ వైట్ ట్రిబ్యూట్' పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఇదొక చారిత్రక ఘట్టమని, అందరికీ గుర్తుండిపోయేలా దీనిని నిర్వహించబోతున్నామని మంచ విష్ణు తెలిపారు.
ఫిజికల్ ట్రైనర్ గా కెరీర్ ప్రారంభించిన భక్త వత్సలం నాయుడు ఆ తర్వాత చిత్రసీమలోకి సహాయ దర్శకుడిగా అడుగుపెట్టారు. తొలి రోజుల్లో వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఆయన్ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు 'స్వర్గం - నరకం'తో హీరోని చేసి, మోహన్ బాబు గా నామకరణం చేశారు. ఆ తర్వాత ప్రతినాయకుడిగా ఎన్నో చిత్రాలలో నటించారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థను స్థాపించి, బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. కథానాయకుడిగా వైవిధ్యమైన చిత్రాలను నిర్మించారు. నటనలోనే కాదు డైలాగ్ డెలివరీలోనూ మోహన్ బాబు తనదైన పంథాలో సాగిపోయారు. కేవలం సినిమా రంగానికే పరిమితం కాకుండా విద్యా రంగంలోకి అడుగుపెట్టి తన దాతృత్వాన్ని ప్రదర్శించారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఒంటరిగా సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టి ఇవాళ తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం మోహన్ బాబు నాని హీరోగా తెరకెక్కుతున్న 'ది పారడైజ్'లో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ, కుమారులు విష్ణు, మనోజ్ సైతం చిత్రసీమలోనే రాణిస్తుండటం విశేషం. నటుడిగా మోహన్ బాబు జర్నీని అందరికీ మరోసారి తెలియచేసేలా స్వర్ణోత్సవాలను జరుపబోతున్నామని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియచేస్తామని విష్ణు చెప్పారు.
 
                     
                              
  






 
 
Comments