ఔషధ విద్యలో ఏఐ
హైదరాబాద్ : ఉన్నత విద్యా రంగంలో ఏఐ మరింతగా విస్తరిస్తోంది.. ఇప్పటిదాకా ఇంజినీరింగ్ కోర్సుల వరకే పరిమితమైన కృత్రిమ మేధ ఔషద విద్యలోనూ తప్పనిసరి కానుంది. నాలుగేళ్ల బీ-ఫార్మసీ, ఆరేళ్ల ఫార్మ్-డీ, రెండేళ్ల వ్యవధి గల ఎం-ఫార్మసీలో ఈ ఏడాది నుంచి కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆరేళ్ల అనంతరం మారిన కొత్త సిలబ్‌సలో ఎమర్జింగ్ టెక్నాలజీ సబ్జెక్టులకు అత్యంత ప్రాధాన్యం కల్పించారు. ఇక సోమవారం ఎప్‌సెట్ ఫార్మసీ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 ఫార్మసీ కాలేజీలుండగా యూజీ, పీజీ విద్యలో దాదాపు 70వేల మంది అభ్యసిస్తున్నారు. ఇకనుంచి ఫార్మసీలో థియరీ, ప్రాక్టికల్ తరగతులకు విద్యార్థి, అధ్యాపకులు 20:1 నిష్పత్తిలో ఉండాలి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా యాజమాన్యాలు నియామాకాలు చేపట్టాలి. అలాగే 60సీట్లున్న ఫార్మసీ కాలేజీల్లో బోధనా సిబ్బంది కనీసం 12మంది ఉండాలి. కొత్త సిలబ్‌సలో ఏఐ, ఫైథాన్ కోడింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంటి ఎమర్జింగ్ టెక్నాలజీ సబ్జెక్టులకు ప్రాధాన్యమిచ్చారు. ఇది ప్రథమ సంవత్సరం నుంచే అందుబాటులోకి రానుంది. కొత్త సాంకేతిక వినియోగం కోసం ఇప్పటివరకు ఇతర రంగాల నిపుణులు ఉండగా.. కొత్తగా ఫార్మసీ విద్యలో దీనిని ప్రవేశపెట్టారు. డేటా ఆధారిత అనుభవాల కోసం మెషిన్‌లర్నింగ్ మోడల్స్, రోగుల రికార్డుల గుర్తింపులో బ్లాక్‌చైన్, ఫార్మసీ ఆపరేషన్స్‌లో రోబోటిక్స్ టెక్నాలజీ వినియోగం కొత్త సిలబ్‌సలో ప్రాధాన్యాంశంగా పొందుపరిచారు. యూజీ స్థాయిలో పరిశోధన ప్రాజెక్టులు, ఇంటర్న్‌షి్‌పకు గతంలో తక్కువ ప్రాధాన్యం ఉండగా.. కొత్త సిలబ్‌సలో దీనిని తప్పనిసరి విద్యగా పేర్కొన్నారు. ఫార్మసీ చివరి సంవత్సరంలో పరిశ్రమల్లో అనుభవం కోసం ప్రత్యేక విధానం ప్రకటించారు. ఫార్మసీలో ఇప్పటివరకున్న ఒకే సబ్జెక్టు విధానంలో ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టులు అమలు కానున్నాయి. ఇందులో కంప్యుటేషనల్ డ్రగ్ డిస్కవరీ, డిజిటల్ హెల్త్ అనలిటిక్స్, ప్రిసీషన్ మెడిసన్, ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టం లాంటివి ఉన్నాయి. అలాగే ఫోరెన్సిక్, నానో టెక్నాలజీ, న్యాయ విద్య, మేనేజ్మెంట్ వంటి సబ్జెక్టులున్నాయి. ఫార్మసీ అన్ని యూజీ కోర్సులు సెమిస్టర్ విధానంలో ఉంటాయి. మొదటి 4 సెమిస్టర్లలో కోర్ సబ్జెక్టులతోపాటు ఏఐ, ఎంఎల్, పైథాన్ లాంటి డిజిటల్ సబ్జెక్టులు, తరువాతి సెమిస్టర్‌లలో స్పెషలైజేషన్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
Comments