కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్
సిద్దిపేట జిల్లా : ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకట్ స్వామి వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్దిపేట పట్టణం 8వ వార్డుకు చెందిన పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడారు.
కేసీఆర్ హయాంలోనే రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, వాటికి తమ ప్రభుత్వం రూ.60 వేల కోట్ల వడ్డీ కడుతుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిరుపేదలకు ఇచ్చామని వెల్లడించారు. వెయ్యి పడకల ఆస్పత్రి సిద్దిపేటకు అవసరం లేదని.. 500 బెడ్ల ఆస్పత్రి సరిపోతుందని అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు గ్రూపులు లేకుండా మున్సిపల్ పీఠం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి వివేక్ వెంకట్ స్వామి హామీ ఇచ్చారు.










Comments