• Apr 19, 2026
  • NPN Log

    హైదరాబాద్‌  : స్టాక్‌ మార్కెట్‌లో అధిక లాభాలొస్తాయి.. ట్రేడింగ్‌లో శిక్షణ ఇస్తామని అమాయకులను నమ్మించి.. నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లు, నకిలీ ట్రేడింగ్‌ ట్రైనింగ్‌ గ్రూపులు, నకిలీ ఫారెక్స్‌ ట్రేడింగ్‌ సంస్థల పేరిట, ఉద్యోగావకాశాల పేరిట సైబర్‌ నేరగాళ్లు.. రూ.కోట్లు స్వాహా చేస్తున్నారు. అలా రూ.1.49 కోట్లు కాజేశారని ఒక్కరోజే సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసు స్టేషన్‌లో ఆరు ఫిర్యాదులు నమోదయ్యాయి. వారిని నమ్మించడానికి మధ్యలో కొంత ఉపసంహరణకు అనుమతిస్తున్నారు. అటుపై మొత్తం విత్‌ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారి ఖాతా తొలగించినట్లు, పన్ను చెల్లించాలంటూ, మరింత పెట్టుబడి పెట్టాలంటూ సందేశాలు వస్తాయి.

    ట్రేడింగ్‌ శిక్షణ అంటూ 60.50 లక్షల మోసం

    కూకట్‌పల్లికి చెందిన ఐటీ ఉద్యోగిని ‘జీ7 ఫ్రీ స్టాక్‌ లర్నింగ్‌ అండ్‌ డిస్కషన్‌’ అనే వాట్సాప్‌ గ్రూపులో చేర్పించి.. స్టాక్స్‌ ట్రేడింగ్‌లో శిక్షణ పేర రూ.60.50 లక్షలు పెట్టుబడి పెట్టించారు. మధ్యలో రూ.10 వేలు విజయవంతంగా ఉపసంహరించడంతో నమ్మకం పెరిగింది. ‘రాజ్‌పుతాన్‌ స్టెయిన్‌లెస్‌ స్టీల్‌’ అనే సంస్థ ఐపీఓలో సుమారు రూ.87 లక్షల విలువైన 60 వేల షేర్లు కేటాయించామని నమ్మించినా.. రూ.2 కోట్ల లాభం చూపినా, వాటి ఉపసంహరణకు అనుమతించలేదు.

    కోటక్‌ను పోలిన యాప్‌తో 37.45 లక్షలు హాంఫట్‌

    మాదాపూర్‌ వాసితో గత జనవరి 27న ‘జీ202 కొటక్‌ వెల్త్‌ అలయెన్స్‌’ అనే వాట్సాప్‌ గ్రూపులో.. దాని అనుబంధ ‘కోట్‌మ్యాప్‌’ యాప్‌లో ట్రేడింగ్‌ ఖాతా తెరిపించారు. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకూ రూ.37.45 లక్షల పెట్టుబడి పెట్టించారు. లాభంతోకలిపి అతని ఖాతాలో రూ.69 లక్షల నగదు ఉన్నట్లు చూపి.. రూ.100, రూ.లక్ష నగదు ఆయన ఖాతాలో జమ చేశారు. తర్వాత ఓ ఐపీఓలో పెట్టుబడి రూ.1.54 కోట్ల విలువైన షేర్లు కేటాయించామని, రూ.85 లక్షలు చెల్లించాలన్నారు. తానంత డబ్బు చెల్లించలేనంటే ఆయన ఖాతా బ్లాక్‌ చేస్తామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని బెదిరించారు. దీన్ని అనుమానించిన బాధితుడు కూకట్‌పల్లిలో కోటక్‌ సెక్యూరిటీస్‌ ఆఫీసును సంప్రదిస్తే అది నకిలీ యాప్‌ అని తేలింది.

    ఫారెక్స్‌ ట్రేడింగ్‌.. ఉద్యోగం పేర 12 లక్షలకు టోకరా

    బహదూర్‌పల్లి వాసికి వాట్సాప్‌ ద్వారా ‘ఫారెక్స్‌ ట్రేడింగ్‌’ సందేశం పంపారు కేటుగాళ్లు. ‘ట్రేడింగ్‌పై ప్రత్యేక శిక్షణిస్తామని, పెట్టుబడి పెడితే తక్కువ సమయంలోనే లాభాలొస్తాయని నమ్మించి రూ.7,73,500 పెట్టుబడి పెట్టించారు. కొద్ది రోజులకు ఉపసంహరించుకోవడానికి ప్రయత్నిస్తే.. పన్ను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాచుపల్లిలోని కౌసల్య కాలనీ యువతితో టెలిగ్రామ్‌ గ్రూపు ద్వారా పరిచయమైన సైబర్‌ మోసగాళ్లు.. ట్రేడింగ్‌ టాస్క్‌లు పూర్తి చేస్తే పారితోషికం ఇస్తామని.. యూపీఐ ఖాతాల ద్వారా రూ.5.53 లక్షల పెట్టుబడి పెట్టించి తర్వాత ముఖం చాటేశారు. మరో ఘటనలో కూకట్‌పల్లి వాసికి యాష్‌ టెక్నాలజీ్‌సలో ఉద్యోగమొచ్చిందని ఆఫర్‌ లెటర్‌ ఇచ్చి రూ.3.90 లక్షలు కాజేశారు. కానీ ఆ వ్యక్తి గతేడాది మే నుంచి గత జనవరి వరకూ వేచి చూసినా సదరు కంపెనీలో ఉద్యోగం రాలేదు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement