తుర్కియేకు భారీగా భారత పెట్రోలియం
న్యూఢిల్లీ : మన దాయాది పాకిస్థాన్‌కు నిత్యం వంతపాడే తుర్కియేకు భారత్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగాయి. ఆగస్టులో రోజుకు 20వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేయగా.. సెప్టెంబర్‌లో ఏకంగా రోజుకు 56 వేల బ్యారెళ్ల ఎగుమతులు జరిగాయి. పాక్ మిత్రదేశమైన టర్కీ తరచూ కశ్మీర్ అంశంలో పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలోనూ బహిరంగంగా పాక్‌కు మద్దతు ప్రకటించింది. అలాంటిది ఇప్పుడా భారీగా పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతి అవుతుండటం గమనార్హం. భారత్‌లో భారీగా చమురు శుద్ధి సామర్థ్యం ఉన్న రిలయన్స్తోపాటు నయారా సంస్థ ఈ పరిస్థితిని అందిపుచ్చుకున్నాయి. రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఈ సంస్థలు... శుద్ధి చేసి తుర్కియే, బ్రెజిల్, యూఏఈ, పలు ఆఫ్రికా దేశాలకు సరఫరా చేస్తున్నాయి. మొత్తంగా ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో భారత్ నుంచి పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 14శాతం పెరిగాయి.
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులతో..
ప్రపంచంలో భారీగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా కూడా ఒకటి. అందుకు అనుగుణంగా రిఫైనరీలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి రిఫైనరీలలో. ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, కిరోసిన్, విమాన ఇంధనం (జెట్ ఫ్యూయల్), ఇతర పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చి చాలా దేశాలకు ఎగుమతి చేస్తుంటుంది. అయితే ఇటీవల ఉక్రెయిన్ పలు రష్యా రిఫైనరీలపై డ్రోన్లతో దాడులు చేసి ధ్వంసం చేయడంతో పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో, రష్యా పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకునే బ్రెజిల్, తుర్కియే, యూఏఈ, పలు ఆఫ్రికా దేశాలకు ఇబ్బంది మొదలైంది.
యూరప్ దేశాలకు భారీగా డీజిల్ ఎగుమతులు
భారత్ నుంచి యూరప్ దేశాలకు డీజిల్ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి. సెప్టెంబర్‌లో ఈ ఎగుమతులు 97 కోట్ల బ్యారెళ్ల నుంచి కోటీ 4 లక్షల బ్యారెళ్ల మధ్య ఉండవచ్చని అంచనా. రష్యా నుంచి పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా నిలిచిపోవడం, ఆయా దేశాల్లో రిఫైనరీల్లో వార్షిక మరమ్మతులతో ఉత్పత్తి తగ్గిపోవడంతో.. యూరప్ దేశాలు భారీగా డీజిల్ దిగుమతి చేసుకుంటున్నాయని రాయిటర్స్ పేర్కొంది.
Comments