నేడు తొలేళ్లు ఉత్సవం.. ఏర్పాట్లు పూర్తి
విజయనగరం : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం పైడిమాంబ సిరిమానోత్సవానికి ముందు రోజు జరిగే తొలేళ్ల ఉత్సవం సోమవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 12 గంటలకు పైడిమాంబకు పంచామృతాభిషేకాలు నిర్వహించి తొలేళ్లకు సిద్ధం చేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిసంఖ్యలో అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఘాటాలతో వచ్చి మొక్కుబడులు తీర్చుకోనున్నారు. తొలేళ్ల రోజున సోమవారం రాత్రి హుకుంపేట నుంచి ఘాటాలు ఊరేగింపుగా చదురుగుడికి చేరుకుంటాయి.
అక్కడ పూజలు అనంతరం రాత్రి పది గంటల తరువాత మేళతాళాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పులివేషాల మధ్య ఊరేగింపుగా కోట వద్దకు చేరుకుంటాయి. అక్కడ పూజల తర్వాత ఘాటాలు చదురుగుడికి వెళ్తాయి. అనంతరం పైడిమాంబ ఆలయంలో విత్తనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాక అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలయ ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు ఆ విత్తనాలను రైతులకు అందజేస్తారు. ఈ విత్తనాలు పొలాల్లో వేస్తే పాడిపంటలు పుస్కలంగా పండుతాయని ప్రగాఢ నమ్మకం. ఈ తంతుతో తొలేళ్లు ముగుస్తాయి.









Comments