• Oct 05, 2025
  • NPN Log

    నల్గొండ : దసరా పండగ వేళ నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరచర్లలో తీవ్ర విషాదం నెలకొంది. డిండి వాగులో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పంగడ నేపథ్యంలో గ్రామ సమీపంలోని డిండి వాగు వద్దకు సాయి ఉమాకాంత్ (10), గోపి (21), రాము (30) వెళ్లారు. అయితే సాయి ఉమాకాంత్ స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో బాలుడు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. ఇది గమనించిన రాము, గోపి.. చిన్నారిని కాపాడేందుకు వాగులోకి దిగారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహించడంతో వారిద్దరూ కొట్టుకుపోయారు. ఆ వాగు సమీపంలో ఉన్న వారు ఇదంతా గమనించి రక్షించేందుకు ప్రయత్నించారు.


    కానీ సాధ్యం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం వాగులో గాలించి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఈ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నల్గొండ జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఒకేసారి ముగ్గురు పండగవేళ చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు బాధిత కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. కుటుంబ సభ్యులను కోల్పోవడంతో గుండెలు పగిలేలా రోదించారు.


    అయితే, ఈ ముగ్గురి స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిగా పోలీసులు చెప్పారు. దసరా సెలవుల నేపథ్యంలో వీరంతా నల్గొండ జిల్లా దేవరచర్లలోని బంధువుల ఇంటికి వచ్చారని వివరించారు. కాగా, దసరా సెలవులు ముగియడంతో శుక్రవారం నాడు తెనాలికి బయలుదేరాల్సి ఉందని.. ఇంతలోనే మరణం ముంచుకొచ్చిందని యువకుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ వెల్లడించారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement