ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద
ప్రకాశం బ్యారేజీకి మళ్లీ వరద పోటెత్తింది. తుఫాన్ కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీరు కృష్ణానదిలో కలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 5,66,860 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో గేట్లన్నీ పూర్తిస్థాయిలో ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల నుంచి 3,82,295 క్యూసెక్కులు, పాలేరు నుంచి 23,967, కీసర నుంచి 96,244 క్యూసెక్కుల వరద వస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రవహించే మునేరుకు ఎగువ నుంచి 1,49,946 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ మొత్తం నీరు కృష్ణానదిలోకి చేరుతోంది. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారానికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే ఎగువన కురిసిన వర్షాలకు కొన్ని రోజులు వరద హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
 
 
  
                      
                               
  








 
  
 
Comments