మార్కెట్కు ఆర్‌బీఐ జోష్
ముంబై: ఈక్విటీ మార్కెట్లో ఆర్‌బీఐ పాలసీ ఉత్తేజం నింపింది. వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగించడంతో పాటు ఈ ఏడాదికి వృద్ధిరేటు అంచనాను 6.8 శాతానికి పెంచడం సెంటిమెంట్ బలపడేందుకు దోహదపడింది. దీనికి తోడు ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణులు, క్రూడాయిల్ ధరల తగ్గుదలతో ఇన్వెస్టర్లు తక్కువ రేట్లకు అందుబాటులో ఉన్న నాణ్యమైన షేర్ల కొనుగోలుకు ఉత్సా హం చూపారు. ప్రధానంగా వడ్డీరేట్ల ప్రభావానికి లోనయ్యే రంగాల షేర్లు లాభాల బాట పట్టాయి. ఎనిమిది రోజుల వరుస నష్టాలకు తెర దించిన సెన్సెక్స్ 715.69 పాయింట్ల లాభంతో 80,893.31 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225.20 పాయింట్ల లాభంతో 24,836.30 వద్ద ముగిసింది. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో, రియల్టీ కౌంటర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. బ్యాంకెక్స్ 1.44ు లాభపడి 62,401.58 పాయింట్లకు చేరింది. ఆటో ఇండెక్స్ 0.74ు, రియల్టీ ఇండెక్స్ 1.11ు వృద్ధిని నమోదు చేశాయి. రంగాల వారీ సూచీలన్నీ కూడా లాభాల్లో ముగిశాయి.
అమెరికన్ డాలర్ మారకంలో రూపాయి జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి 9 పైసలు కోలుకుని 88.71 వద్ద ముగిసింది. మంగళవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,327 కోట్ల విలువ గల షేర్లను విక్రయించారు.
ఎల్‌జీ ఇష్యూ ధర శ్రేణి రూ.1080-1140
ఎల్‌జీ ఎలక్ర్టానిక్స్ ఈ నెల 7వ తేదీన ప్రారంభించనున్న రూ.11,607 కోట్ల విలువ గల ఐపీఓలో షేరు ధర శ్రేణిని రూ.1080-రూ.1140గా ప్రకటించింది.
పసిడి ధర రూ.1,21,100
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్‌లో ర్యాలీ కొనసాగుతోంది. బుధవారం ఢిల్లీలో 10 గ్రాములు మేలిమి (24 కేరట్స్) బంగారం ధర రూ.1,100 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,21,100కు చేరింది. కిలో వెండి ధర మాత్రం ఎదుగూ బొదుగు లేకుండా రూ.1,50,500 వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర 3,895.33 డాలర్లకు చేరి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
నేడు సెలవు
దసరా పర్వదినం, గాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం మార్కెట్లకు సెలవు. ఈక్విటీ, బులియన్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు పనిచేయవు.
Comments