సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య
అమరావతి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె.రామకృష్ణ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఒక ప్రకటనలో తెలిపారు. చండీగఢ్‌లో జరిగిన జాతీయ మహాసభల్లో రామకృష్ణను జాతీయ కార్యదర్శిగాను, మంగళవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఈశ్వరయ్యను రాష్ట్ర కార్యదర్శిగాను ఎన్నుకున్నట్లు రాజా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన సీపీఐ రాష్ట్ర మహాసభల్లోనే నూతన కార్యదర్శి ఎన్నికను పూర్తి చేయాల్సి ఉండగా... నాయకత్వం విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో అప్పుడు వాయిదా వేశారు. 102 మంది సభ్యులతో నూతన రాష్ట్ర సమితి ఏర్పాటు కాగా.. అందులో 33 మంది రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా అప్పట్లో ఎన్నికయ్యారు. చండీగఢ్ జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత రాష్ట్ర కార్యదర్శిని కూడా ఎన్నుకుంటామని అగ్ర నాయకత్వం నాడు ప్రకటించింది. చెప్పినట్లుగానే పార్టీలో ఏకాభిప్రాయం సాధించి ఈశ్వరయ్యను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సీపీఐ నాయకురాలు పి.దుర్గాభవానీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో ఈశ్వరయ్య పేరును రామకృష్ణ ప్రతిపాదించగా.. పార్టీ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు బలపర్చారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య విద్యార్థి దశ నుంచే సీపీఐలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కాగా, ఈశ్వరయ్య నాయకత్వంలో రాష్ట్ర పార్టీ మరింత పటిష్ఠమై బలమైన ప్రజా ఉద్యమాలు కొనసాగించాలని జాతీయ నాయకులు ఆకాంక్షించారు. నవంబరు 2, 3 తేదీల్లో జరగనున్న రాష్ట్ర సమావేశంలో భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
Comments