సెప్టెంబరులో రికార్డ్ స్థాయిలో 3,048 కోట్ల అమ్మకాలు
హైదరాబాద్ : రాష్ట్రంలో దసరా పండుగ సీజన్‌లో మద్యం విక్రయాలు రికార్డులు సృష్టించాయి. గాంధీ జయంతి రోజున పండుగ రావడంతో దుకాణాలు మూసి ఉంటాయన్న ఉద్దేశంతో ముందే భారీగా కొనుగోళ్లు జరగాయి. సెప్టెంబరు 29న రూ.278 కోట్లు, 30న రూ.333 కోట్లు, అక్టోబరు 1న రూ.86.23 కోట్లు.. కలిపి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.697.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇదంతా డిపోల నుంచి మద్యం దుకాణాలకు తరలిన సరుకు మాత్రమే. అప్పటికే దుకాణాల్లో ఉన్న స్టాకును కూడా కలిపితే.. మద్యం విక్రయాలు మరింత ఎక్కువే జరిగినట్టు అంచనా. మొత్తంగా ఈ ఏడాది సెప్టెంబరులో రూ.3,048 కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన విక్రయాలు రూ.2,839 కోట్లతో పోలిస్తే ఇది 7శాతం ఎక్కువ. అయితే పండుగ ముందు మూడు రోజుల లెక్కలనే పరిశీలిస్తే.. విక్రయాలు 50శాతానికిపైనే పెరిగినట్టు చెబుతున్నారు.
బీర్లకు తగ్గిన డిమాండ్..
రాష్ట్రంలో సెప్టెంబరులో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎల్) విక్రయాలు పెరగగా.. బీర్ల అమ్మకాలు తగ్గాయి. గత ఏడాది సెప్టెంబరులో ఐఎంఎల్ లిక్కర్ 28.81లక్షల కేసులు అమ్ముడవగా.. ఈసారి 29.92 లక్షల కేసులు విక్రయించారు. గతంలో బీర్లు 39.71లక్షల కేసులు అమ్ముడవగా.. ఈసారి 36.46 లక్షల కేసులకు తగ్గాయి. వరుసగా వానలతో చల్లటి వాతావరణం, బీర్ల ధరల పెరుగదల నేపథ్యంలో అమ్మకాలు తగ్గాయని భావిస్తున్నారు.
Comments