• Apr 19, 2026
  • NPN Log

    కైరో : హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మళ్లీ మూసేసింది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం, లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపిన నేపథ్యంలో జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన ఇరాన్‌.. శనివారం ఉదయం దానిని మళ్లీ మూసేసినట్లు వెల్లడించింది. శాంతి సంధిని అమెరికా ఉల్లంఘించటం వల్లనే జలసంధిపై తిరిగి ఆంక్షలు విధిస్తున్నట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. అమెరికా-ఇరాన్‌ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 22వ తేదీతో ముగుస్తుంది. లెబనాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కూడా గురువారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో ఒప్పందం కొనసాగినంత కాలం జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలపై ఆంక్షలను పూర్తిగా తొలగిస్తున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ తెలిపారు. ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్వాగతించారు. అయితే, ఇరాన్‌ నౌకాశ్రయాలపై తమ నౌకాదళం దిగ్బంధం ఎప్పటిలాగే కొనసాగుతుందని ప్రకటించారు. ఈ ప్రకటన ఇరాన్‌కు కోపం తెప్పించింది. దీంతో శనివారం ఉదయమే జలసంధిని మళ్లీ మూసేసింది.

     

    భారతీయ నౌకలపై కాల్పులు

    జలసంధిని మూసేసిన క్రమంలో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్‌జీసీ దాడులు చేస్తోంది. భారతీయ పతాకం ఉన్న 14నౌలకు శనివారం హోర్ముజ్‌ను దాటడానికి ప్రయత్నించాయి. అయితే, ఇందులో రెండు చమురు ట్యాంకర్లపై ఇరాన్‌ గన్‌బోట్లు వాటిపై కాల్పులు జరిపినట్లు బ్రిటన్‌ మిలిటరీకి చెందిన యునైటెడ్‌ కింగడమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సంస్థ తెలిపింది. అయితే, ఈ కాల్పుల్లో నౌకలకుగానీ, వాటిలోని సిబ్బందికి గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. కాల్పుల తర్వాత నౌకలు ఒమన్‌ తీరంవైపు తిరిగి వెళ్లాయి. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. భారత్‌లోని ఇరాన్‌ రాయబారికి తన నిరసనను తెలియజేసింది. జలసంధిని మళ్లీ మూసివేసిన నేపథ్యంలో పశ్చిమాసియాలో శాశ్వత శాంతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే, చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ మాత్రం ఆశాభావంతోనే ఉంది. రెండో దఫా చర్చలకు అమెరికా-ఇరాన్‌ ఇప్పటికీ సుముఖంగానే ఉన్నాయని పాకిస్థాన్‌ విదేశాంగమంత్రి ఇషాక్‌ దార్‌ శనివారం తెలిపారు. కాగా, ఇరాన్‌ నుంచి 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురుతో డోర్నా సూపర్‌ ట్యాంకర్‌ భారత్‌కు వస్తోందని హైదరాబాద్‌లోని ఇరాన్‌ కాన్సులేట్‌ ట్వీట్‌ చేసింది.

    రష్యా చమురుపై అమెరికా యూటర్న్‌

    రష్యా చమరు కొనుగోళ్లపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా యూటర్న్‌ తీసుకుంది. మినహాయింపులను పునరుద్ధరించే ప్రసక్తి లేదని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ట్రంప్‌ ప్రభుత్వం మాట మార్చింది. రష్యా పెట్రోలియం ఉత్పత్తులపై మరో నెల రోజులు ఆంక్షలు సడలిస్తున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. శుక్రవారం నాటికి రష్యా నౌకల్లోకి ఎక్కించిన చమురును మే 16 వరకూ కొనుగోలు చేయవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌ 30 మిలియన్‌ బ్యారెళ్ల చమురును ఆర్డర్‌ చేసింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement