ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న మాజీ మంత్రి కుమారుడి కారు..
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల అమలు కమిటీ అధ్యక్షుడు హెచ్ఎం రేవణ్ణ కుమారుడు శశాంక్ కు చెందిన కారు, ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. ప్రమాదంలో రాజేశ్ (27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. గురువారం రాత్రి పొద్దుపోయాక 10.30 గంటల తర్వాత రామనగర జిల్లా పరిధిలోని గుడేమారనహళ్ళి టోల్ వద్ద ప్రమాదం జరిగింది. డాబ్సపేటవైపు నుంచి వస్తున్న కారు వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది.
కారును ఆపకుండా అక్కడనుంచి పరారీ అయినట్టు ప్రత్యక్షసాక్షులు గుర్తించారు. కొందరు కారును వెంబడించారు సుమారు ఐదు కిలోమీటర్లు తర్వాత కారును అడ్డుకున్నారు. కాగా మృతి చెందిన యువకుడు రాజేశ్ మాగడి తాలూకా బెళగుంద నివాసి. స్థానిక డాబ్సపేట ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. రాత్రి పనిముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం కుదూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కాగా కాంగ్రెస్ నేత హెచ్ఎం రేవణ్ణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నా కుమారుడు శశాంక్ కారు నడపలేదని, డ్రైవర్ ఉన్నాడన్నారు. ప్రమాదం పట్ల బాధ కలుగుతోందని, రాత్రి గుడేమారనహళ్ళి వద్ద ప్రమాదం జరిగిందన్నారు. అక్కడ స్థానికులు ఎక్కువమంది ఉన్నందున గొడవ జరుగుతుందని భయపడి వెళ్లిపోయాడన్నారు. సంఘటనకు క్షమాపణలు చెబుతున్నానని, మృతుడి కుటుంబీకులను కలిసి పరామర్శిస్తానన్నారు. బాధిత కుటుంబానికి సాయం చేస్తానన్నారు.










Comments