• Oct 24, 2026
  • NPN Log

    సాధారణంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు విడుదలకి కొన్ని రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవుతుంటాయి. అయితే, రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో దర్శకుడు నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ: పార్ట్ 1’ విషయంలో మేకర్స్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలకు ఏకంగా 13 రోజుల ముందే బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అన్ని భాషల టికెట్ బుకింగ్స్‌ను ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఈ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అనుసరిస్తున్న టికెట్ ధరల వ్యూహం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఈ భారీ చిత్ర థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు  తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ద్వారా దక్కించుకున్నారు. అయితే, మిగతా భారీ పాన్ ఇండియా సినిమాల మాదిరిగా ప్రభుత్వాల నుంచి ప్రత్యేక జీవోలు తెచ్చుకుని టికెట్ ధరలు పెంచే సాహసం చేయకుండా, దిల్ రాజు చాలా పక్కాగా సేఫ్ రూట్ ఎంచుకున్నారు. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు లేకుండా సాధారణ ధరలతోనే సినిమాను విడుదల చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    ఈ మధ్య కాలంలో పరభాషా చిత్రాలకు కూడా టికెట్ ధరలను తెలుగు రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా ఏపీలో పెంచుకునే వెసులుబాటును కల్పిస్తున్నారు. కానీ, ‘రామాయణ’ (Ramayana)కు మాత్రం దిల్ రాజు అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ విషయంలో ఆయన ‘ఇరుముడి’నే నమ్ముకుంటూ, సాధారణ ధరలతో, ప్రేక్షకులకు అందుబాటులో ఈ సినిమా ఉంచాలని భావిస్తున్నారు. ఆయన నిర్ణయం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులు ఈ విజువల్ వండర్‌ను రూ. 177కే వీక్షించవచ్చు (3D గ్లాసెస్‌కు అదనంగా రూ. 25 ఉంటుంది). ఇక హైదరాబాద్‌లోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు రూ. 200 నుంచి రూ. 295 లతో అందుబాటులో ఉండనున్నాయి. ఒకవేళ స్పెషల్ టికెట్ హైక్స్‌కు వెళ్లి ఉంటే ఒక్కో టికెట్‌పై అదనంగా మరో రూ. 50 నుంచి రూ. 75 వరకు ప్రేక్షకులపై భారం పడేది.

    ఇటీవల విడుదలైన కొన్ని భారీ చిత్రాలు టికెట్ రేట్ల పెంపు వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఆ రిస్క్‌ను ముందే పసిగట్టిన దిల్ రాజు.. ‘రామాయణ’ వంటి మహాకావ్యానికి అధిక టికెట్ ధరల ద్వారా వచ్చే కలెక్షన్ల కంటే, కుటుంబ సమేతంగా భారీ సంఖ్యలో జనాలు థియేటర్లకు రావడం అత్యంత కీలకమని భావించారు. రీజనబుల్ టికెట్ రేట్లు ఉండటం వల్ల సామాన్య ప్రేక్షకులు, కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉంటుందని దిల్ రాజు భావిస్తున్నారు. రణ్‌బీర్ కపూర్‌తో పాటు సాయి పల్లవి (సీతగా), యష్ (రావణుడిగా), సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లను కూడా చిత్రబృందం దేశవ్యాప్తంగా ముమ్మరం చేస్తోంది. నితీష్ తివారి వెండితెరపై సృష్టించిన విజువల్ మ్యాజిక్ ప్రేక్షకులను మెప్పిస్తే.. దిల్ రాజు తీసుకున్న ఈ ‘సేఫ్ అండ్ రీజనబుల్ టికెట్ ప్రైసింగ్’ నిర్ణయం బాక్సాఫీస్ వద్ద అత్యంత తెలివైన మాస్టర్ స్ట్రోక్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో? నవంబర్ 5న దీవాళి స్పెషల్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement