• Oct 24, 2026
  • NPN Log

    విశ్వానికి నాథుడైన ఆ పరమశివుడు దేశవ్యాప్తంగా పన్నెండు జ్యోతిర్లింగాలుగా ఉద్భవించి భక్తులను కటాక్షిస్తున్నాడు. చరాచర సృష్టికి మూలమైన పంచభూతాలు ఆయన ఆధీనాలు. అందుకు ప్రతీకగా పంచభూతలింగ క్షేత్రాలు కూడా ఉన్నాయి. కంచిలో పృధ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో తేజోలింగం. శ్రీకాళహస్తిలో వాయులింగం, చిదంబరంలో ఆకాశలింగం కొలువయ్యాయి. అదే విధంగా జలకంఠేశ్వర ఆలయాలు కూడా సుప్రసిద్ధాలే. ఇటీవల చెన్నై సమీపంలోని జలకంఠేశ్వరుణ్ణి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ దర్శించుకున్న నేపథ్యంలో... ఆ ఆలయం పట్ల భక్తుల్లో ఆసక్తి పెరిగింది. ఇంతకీ శివుడికి జలకంఠేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చింది? చెన్నై జలకంఠేశ్వరుడి కథేమిటి?

    జ్వాలాకంఠుడు, జ్వరహరుడు

    ‘నీలకంఠుడు’ అనే శివనామం సుపరిచితమే. సముద్ర మథనం నుంచి వెలువడిన హాలాహలం బారి నుంచి లోకాలను రక్షించడానికి పరమేశ్వరుడు ఆ విషాన్ని తన గొంతులో నిలుపుకొని... విషకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు. కర్ణాటకలోని నంజనగూడులో నంజుండేశ్వరాలయం ఉంది. ‘నంజు’ అంటే విషం. కాబట్టి ‘నంజుండేశ్వరుడు’ అని కూడా అంటారు. మరి ‘జలకంఠేశ్వరుడు’ ఎవరు? అది జలతత్త్వం ప్రధానంగా కలిగిన శివరూపం. ఈ పేరు వినగానే తమిళనాడులోని వేలూరు కోటలోని అఖిలాండేశ్వరీ సమేత జలకంఠేశ్వరాలయం గుర్తుకు వస్తుంది. నీటి గర్భంలో దొరికిన స్వామి కాబట్టి, కంఠం లోతుగా నీటిలో ఉన్న స్వామి కాబట్టి ‘జలకంఠుడు’ అని స్వామిని పిలుస్తారనేది స్థానికుల మాట. ఆ స్వామి నీటి మధ్యలో కట్టిన అతి పెద్ద కోటలో ఉంటాడు కాబట్టి ఆ వర్ణన సరిగ్గా సరిపోతుంది. చరిత్రను పరిశీలిస్తే వేలూరులో కొలువైన స్వామి పేరు ‘జ్వాలాకంఠుడు’ అని తెలుస్తోంది. అది కాలక్రమేణా జలకంఠుడుగా మారిందనేది ఒక కథనం. కాగా... ‘జ్వరహరేశ్వరుడు’ అనే పేరు శాసనాలలో కనిపిస్తోంది. శైవ ఆగమాల ప్రకారం పరమేశ్వరుడి రూపాలలో జ్వరహరేశ్వరుడు ఒకటి. శారీరకమైన జ్వరాలనే కాదు... తాపత్రయమనే మానసిక జ్వరాలను కూడా తొలగించే స్వామి. ఆ పేరే జలకంఠేశ్వరుడిగా మారి ఉంటుందని ఒక అధ్యయనం సూచిస్తోంది.

    పరమాచార్య సూచనతో...

    ఈ పేరుతో శివుడు పూజలందుకంటున్న మరికొన్ని ఉన్నాయి. ప్రధాని మోడీ సందర్శించిన శ్రీ జలకంఠేశ్వరర్‌ ఆలయం వాటిలో ఒకటి. అది చెన్నై ఐఐటి ప్రాంగణంలో, ఢిల్లీ అవెన్యూ దగ్గర్లో ఉంది. ఆ ఐఐటి స్థాపనకు ముందే... అక్కడి చెరువు సమీపంలో, ఒక మండపం కింద తాటాకు కప్పుతో చిన్న పూజాస్థలం, అందులో శివలింగం ఉండేవనీ, దాన్ని స్థానికులు, సమీప గ్రామాల ప్రజలు పూజించేవారని ఐఐటీ వారసత్వ కేంద్రం పేర్కొంటోంది. తదనంతరం... కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సూచన మేరకు... ఆ జలకంఠేశ్వర లింగానికి ఆగమోక్తంగా పూజలు కొనసాగించడం కోసం ఆలయ నిర్మాణం చేపట్టారు. 1962లో మొదలైన ఈ నిర్మాణం 1965లో పూర్తయింది. అదే ఏడాది జూన్‌ 18న మొదటి కుంభాభిషేకాన్ని నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రధానదైవం శ్రీ జలకంఠేశ్వరుడిగా... శ్రీ కాత్యాయినీ సమేతుడై, గణపతి, సుబ్రహ్మణ్యస్వామి తదితర పరివార దేవతలతో శివుడు దర్శనమిస్తాడు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement