కుదిపేసిన మోదీ..సమాధి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : ప్రధాని మోదీకి ప్రాణహాని కలిగించేలా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలని పార్లమెంటు ఉభయ సభల్లో అధికార పక్షం డిమాండ్ చేసింది. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే బీజేపీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో తమ స్థానాల్లో నిలబడి.. కాంగ్రెస్ సభ్యులకు తీవ్ర నిరసన తెలిపారు. మరోవైపు, ‘కాంగ్రెస్ పార్టీయే పెద్ద ఓట్ చోర్’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు రెండు సభల్లోనూ ఆందోళనలు చేశారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు పలుమార్లు ఉభయసభలూ వాయిదా పడ్డాయి. ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే, కాంగ్రెస్ ఆదివారం ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన సభా అంశాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు లోక్‌సభలో ప్రస్తావించారు. ‘మోదీ! నీ సమాధి కడతాం. ఈరోజు కాకపోతే రేపయినా ఇది తథ్యం’ అంటూ కాంగ్రెస్ సభలో నేతలు విద్వేష నినాదాలు చేశారని, ప్రధానికి ప్రాణహాని కలగజేసేలా వ్యాఖ్యలు చేశారని రిజిజు తెలిపారు. ‘‘మనం రాజకీయ ప్రత్యర్థులమేగానీ శత్రువులం కాదు. కాంగ్రెస్ సభలో జరిగిన ఆ ఘటన అత్యంత దురదృష్ణకరం. 2014లో కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలే చేసిన బీజేపీ సభ్యుడితో ప్రధాని మోదీ సభలోనే క్షమాపణ చెప్పించారు. అదే సంప్రదాయం కాంగ్రెస్ పాటించాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు కూడా పోటీ నినాదాలు చేశారు. బీజేపీ సభ్యులు రాజ్యసభలోనూ కాంగ్రె్‌సకు నిరసన తెలిపారు. మోదీపై వ్యాఖ్యలు కాంగ్రెస్ మనఃస్థితిని తెలియజేస్తున్నాయని రాజ్యసభలో అధికార పక్ష నాయకుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఖండించారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ సహా కాంగ్రెస్ అధిష్ఠానం ఈ వ్యాఖ్యలకుగాను క్షమాపణలు కోరాలని నడ్డా డిమాండ్ చేశారు. దిగజారుడు రాజకీయాలను కాంగ్రెస్ కట్టిపెట్టాలని నడ్డా అనడంపై, ప్రతిపక్ష పార్టీ సభ్యులు పెద్దఎత్తున నిరసనలు తెలిపారు.










Comments