• Dec 16, 2025
  • NPN Log

    అబుధాబి: ఐపీఎల్‌ మినీ వేలం ఎప్పుడూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇక్కడ జరిగే వేలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కామెరూన్‌ గ్రీన్‌కు భారీ డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉంది. భారీ మొత్తంతో ఉన్న కోల్‌కతా, చెన్నై ఫ్రాంచైజీలు.. గ్రీన్‌ను దక్కించుకొనేందుకు పోటీపడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 10 జట్లలో ఖాళీగా ఉన్న 77 స్థానాల కోసం మినీ వేలం జరగనుంది. ఇందుకోసం 359 మందితో కూడిన జాబితాను బీసీసీఐ విడుదల చేసింది. అన్ని ఫ్రాంచైజీల వద్దనున్న మొత్తం రూ. 237.5 కోట్లు. అయితే, అత్యల్ప మొత్తం రూ. 2.75 కోట్లు మాత్రమే కలిగి ఉన్న ముంబై వేలంలో పెద్దగా పోటీపడే చాన్సులేదు. ప్రతిభగల అన్‌క్యా్‌ప్డ ప్లేయర్లను ఆ జట్టు కొనుగోలు చేయవచ్చు. గ్రీన్‌తోపాటు రూ. 2 కోట్ల కనీస ధర కేటగిరీలో ఉన్న భారత ఆటగాళ్లు వెంకటేష్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌, విండీస్‌ ప్లేయర్‌ హోల్డర్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడొచ్చు. ఈసారి సరికొత్త జట్టును తయారు చేసుకొనేందుకు కోల్‌కతా ఎక్కువ మంది ఆటగాళ్లను వదిలేసింది. ముఖ్యంగా ఇద్దరు టాపార్డర్‌ బ్యాటర్లు, ఆల్‌రౌండర్‌ ఆ జట్టుకు ఎంతో అవసరం. గత సీజన్‌లో వెంకటేష్‌ అయ్యర్‌ను రూ. 23.75 కోట్లకు ఖరీదు చేసిన కోల్‌కతా.. ఈసారి అతడిని తక్కువ ధరకే దక్కించుకోవాలనుకొంటోంది. అయితే, రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) అవకాశం లేదు.

     

    గరిష్ఠంగా రూ. 18 కోట్లే?: గత మినీ వేలంలో ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ (రూ. 24.75 కోట్లు) అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈమారు గ్రీన్‌ సరికొత్త రికార్డు నెలకొల్పుతాడని క్రికెట్‌ పండితులు లెక్కలు వేస్తున్నారు. ఒకవేళ బిడ్డింగ్‌లో గ్రీన్‌ రూ. 25 కోట్లు పలికినా.. ఐపీఎల్‌ ‘గరిష్ఠ ఫీజు’ నిబంధన కింద అతడికి రూ. 18 కోట్లు మాత్రమే చెల్లిస్తారు. మిగతా మొత్తం బీసీసీఐకి చేరుతుంది. ఈ నిబంధన ప్రకారం మినీ వేలంలో విదేశీ ఆటగాళ్ల అత్యధిక ఫీజు.. మెగా వేలంలో గరిష్ఠ ధర (రిషభ్‌ పంత్‌ రూ. 27 కోట్లు), అత్యధిక రిటైన్‌ స్లాబ్‌ (రూ. 18 కోట్లు) మధ్య ఏది తక్కువైతే అదే చెల్లించాలనే పరిమితి విధించారు. వేలంలో విదేశీ క్రికెటర్ల కోసం భారీగా కాసులు కుమ్మరిస్తుండడంతో.. ప్రాంచైజీల విజ్ఞప్తి మేరకు ఈ రూల్‌ను ప్రవేశపెట్టారు. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ లివింగ్‌ స్టోన్‌, సౌతాఫ్రికా కీపర్‌ డికాక్‌ కోసం ఆయా జట్లు ఆసక్తి ప్రదర్శించొచ్చు. గత వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన పృథ్వీ షా, సర్ఫరాజ్‌లు ఈసారైనా అవకాశం దక్కుతుందనే ఆశతో ఉన్నారు. చెన్నై వదిలేసిన శ్రీలంక పేసర్‌ మతీశ పతిరన కోసం లఖ్‌నవూ పోటీపడే అవకాశం లేకపోలేదు. అన్‌క్యా్‌ప్డ భారత ఆటగాళ్లు అశోక్‌ శర్మ, ప్రశాంత్‌ వీర్‌, ముకుల్‌ చౌదరిలు ఫ్రాంచైజీల దృష్టిలో ఉన్నారు.

     

    జట్టు ఉన్న డబ్బు ఖాళీలు

    కోల్‌కతా రూ. 64.30 కోట్లు 13 (6 విదేశీ)

    చెన్నై రూ. 43.40 కోట్లు 9 (4 విదేశీ)

    హైదరాబాద్‌ రూ. 25.50 కోట్లు 10 (2 విదేశీ)

    లఖ్‌నవూ రూ. 22.95 కోట్లు 6 (4 విదేశీ)

    ఢిల్లీ రూ. 21.80 కోట్లు 8 (5 విదేశీ)

    బెంగళూరు రూ. 16.40 కోట్లు 8 (2 విదేశీ)

    రాజస్థాన్‌ రూ. 16.05 కోట్లు 9 (1 విదేశీ)

    గుజరాత్‌ రూ. 12.90 కోట్లు 5 (4 విదేశీ)

    పంజాబ్‌ రూ. 11.50 కోట్లు 4 (2 విదేశీ)

    ముంబై రూ. 2.75 కోట్లు 5 (1 విదేశీ)

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).