అమెజాన్ వెబ్ సర్వీసెస్ డౌన్.. పలు వెబ్‌సైట్స్, యాప్స్ బంద్
అమెజాన్ క్లౌడ్ సేవల విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో (ఏడబ్ల్యూఎస్) అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వెబ్‌సైట్స్, యాప్స్ నిలిచిపోయాయి. ఫోర్ట్‌నైట్, స్నాప్‌చాట్, రాబిన్‌హుడ్, కాయిన్‌బాక్స్, రోబ్లాక్స్, వెన్మో వంటి వివిధ రంగాలకు చెందిన వెబ్‌సైట్స్, యాప్స్ నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వినియోగదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తమ సర్వీసులకు ఆటంకం ఏర్పడినట్టు ఏడబ్ల్యూఎస్ ధ్రువీకరించింది. సమస్యను చక్కదిద్దేందుకు తమ ఇంజినీర్లు కృషి చేస్తున్నారని, త్వరలో పరిస్థితి చక్కబడుతుందని పేర్కొంది
నార్త్ వర్జీనియాలోని యూఎస్-ఈస్ట్-1 రీజియన్ డాటా హబ్‌లో సమస్య తలెత్తినట్టు ఏడబ్ల్యూఎస్ తెలిపింది. ఎర్రర్ రేట్స్, లేటెన్సీలు పెరిగాయని వెల్లడించింది. డీఎన్ఎస్ సొల్యూషన్కు సంబంధించిన సమస్యతో ఈ పరిస్థితి వచ్చినట్టు సంస్థ భావిస్తోంది. డీఎన్ఎస్ సమస్యను పరిష్కరించామని, అయితే, పూర్తిస్థాయిలో సర్వీసు అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. ఈ మేరకు తన సర్వీస్ స్టేటస్ పేజీలో రాసుకొచ్చింది.
క్లౌడ్ నెట్వర్క్ ఔటేజీతో ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలపై ప్రభావం పడింది. ప్రభావిత అమెజాన్ డాటా హబ్‌ను వినియోగిస్తున్న అమెజాన్.కామ్, ప్రైమ్ వీడియో, అలెక్సా సేవలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. స్నాప్‌చాట్, సిగ్నల్, కాన్వా, డువోలింగో, క్రంచీరోల్, గుడ్‌రీడ్స్, కాయిన్ బేస్, రాబిన్ హుడ్, వెన్మో, చైమ్, లిఫ్ట్, కాలేజ్బోర్డ్, వెరిజాన్, మెక్‌డోనాల్డ్ యాప్, న్యూయార్క్ టైమ్స్, లైఫ్360, యాపిల్ టీవీ, పర్‌ప్లె్క్సిటీ ఏఐ సేవలు స్తంభించిపోయాయి.
ఈ విషయంపై పర్ప్లెక్సిటీ ఏఐ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ స్పందించారు. తమ సేవలు నిలిచిపోయాయని ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే.. కొన్ని సేవలను ఇప్పటికే పాక్షికంగా పునరుద్ధరించామని ఏడబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ వర్గాలు తెలిపాయి.
Comments