విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్
బెంగళూరు: మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరులో రోడ్ల దుస్థితిపై ఇటీవల కాలంలో కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది. బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా , ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేను కిరణ్ మజుందార్ మంగళవారం ఉదయం వారి నివాసాలకు వెళ్లి కలుసుకున్నారు. తమ మేనల్లుడి వివాహానికి హాజరు కావాల్సిందిగా ఉభయులనూ ఆహ్వానించినట్టు తెలిసింది.
కాగా, తమ మధ్య సమావేశంపై డీకే సామాజిక మాధ్యమం ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. బెంగళూరు పురోగతి, సృజనాత్మక, రాష్ట్ర అభివృద్ధి మార్గాలపై తాము చర్చించినట్టు ఆయన తెలిపారు.
మాటల యుద్ధం
కొద్ది రోజులుగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై కిరణ్ మజుందార్, డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది. బెంగళూరు రోడ్లు, చెత్తతో తాను ఇబ్బందులు పడినట్టు ఒక విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలపై మజుందార్ స్పందించడం చర్చనీయాంశమైంది. సవాళ్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని, అయితే కొందరు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నారని డీకే విమర్శలు గుప్పించారు. బీజేపీ హయాంలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. అయితే బీజేపీ హయాంలో కూడా తాము ఇదే ప్రశ్న వేసినట్టు మజుందార్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు.
Comments