గాంధీ హిల్‌ను చూశారా
ఎప్పుడైనా విజయవాడ వస్తే కనకదుర్గ గుడిని చూసుంటారు.. ప్రకాశం బ్యారేజీని చూసుంటారు.. కానీ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న గాంధీ హిల్‌ను ఎప్పుడైనా చూశారా? ఒకప్పుడు పర్యాటక కేంద్రంగా వెలుగొందిన గాంధీ హిల్.. కాలక్రమంలో ఆదరణ కోల్పోయింది. సిటీ వ్యూపాయింట్‌గా ఉన్న ఆ కొండపై ఉన్న స్మారక స్థూపం వద్దకు వెళ్లాలంటే మెట్లు ఎక్కాల్సిరావడమే దానికి కారణం. అయితే అక్కడకు చేరుకోవడానికి ఇటీవల జంబో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. అంతేగాక కొండ మొత్తానికి సరికొత్త సొబగులు అద్దారు. ఈ ముస్తాబుతో గాంధీ హిల్ మునుపటి కళ సంతరించుకుంది. పెద్దసంఖ్యలో పర్యాటకులు వచ్చి నగర అందాలను వీక్షిస్తున్నారు. మిడ్‌హిల్ వ్యాలీలో మినీ ట్రెయిన్‌పై చక్కెర్లు కొడుతూ పరిసరప్రాంతాల సొగసులను ఆస్వాదిస్తున్నారు. ఇదంతా రీ డెవల్‌పమెంట్ పనులతో సాధ్యమైంది. రానున్న రోజుల్లో గాంధీహిల్ గురించి ప్రపంచం చర్చించుకునేలా ‘గాంధీ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్’ మాస్టర్ ప్లాన్‌కు కూడా అడుగులు పడుతున్నాయి. గాంధీహిల్ సొసైటీ చైర్మన్ కేపీసీ గాంధీ ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి ఆ మాస్టర్ ప్లాన్ గురించి వివరించారు. గాంధీ చరిత్రను తెలియజెప్పటంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేలా డిజైన్ చేశారు. అలాగే భారీ మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్, అతిథి గృహాలను నిర్మించనున్నారు.
స్మారకస్థూపం అద్భుతం..
కొండపైన గాంధీ స్మారక స్థూపం ప్రాంతం నుంచి విజయవాడ అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సిటీ మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో చూడటానికి అవకాశం ఉంటుంది. పునరుద్ధరణ పనులు జరగక ముందు గాంధీ స్మారక స్థూపం దగ్గరకు చేరుకోవాలంటే 230కు పైగా మెట్లను ఎక్కాల్సి వచ్చేది. ఈ కారణంగా చాలామంది ఆసక్తి కనబర్చేవారు కాదు. అద్భుతమైన ఆ వ్యూ పాయింట్‌ను పర్యాటకులు చూడలేకపోతున్నారన్న ఉద్దేశంతో గాంధీహిల్ సొసైటీ రూ. కోటి ఖర్చు చేసి మఽధ్య ప్రాంతం నుంచి పైకి వెళ్లడానికి జంబోలి్‌ఫ్టను ఏర్పాటు చేసింది. లిఫ్ట్ నుంచి నేరుగా స్మారక స్థూపం వరకు ర్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ ర్యాంప్‌పై నుంచి నడుస్తుంటే ఇంద్రకీలాద్రి, కృష్ణానది మొదలు.. యనమలకుదురు శివాలయం వరకు నలువైపులా నగర అందాలన్నీ కనిపిస్తున్నాయి. మధ్య ప్రాంతంలో కొండ చుట్టూ ట్రాక్‌ను పునరుద్ధరించి మళ్లీ మినీ ట్రైన్‌ను తిప్పుతున్నారు. పచ్చటి లాన్లను అభివృద్ధి చేసి, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. దిగువన ప్లానిటోరియాన్ని కూడా ఆధునికీకరించి అందుబాటులోకి తెచ్చారు.
సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో..
దేశంలో మొత్తం ఆరు గాంధీ స్మారక కేంద్రాలు ఉండగా, విజయవాడలోని గాంధీ హిల్ మొట్టమొదటి కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ కొండ సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ హిల్‌ను మొదట్లో ఓర్ కొండగా పిలిచేవారు. 1852లో కృష్ణానదిపై విజయవాడలో మొదటి ఆనకట్ట కట్టిన బ్రిటీష్ ఇంజనీర్ కెప్టెన్ చార్లెస్ ఓర్ పేరు దానికి పెట్టారు. మహాత్మాగాంధీ 1919 నుంచి 1946 మధ్య కాలంలో విజయవాడకు ఆరుసార్లు వచ్చారు. ఈ కొండ దగ్గరే అఖిలభారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు జరిగాయి. 1921లో ఇక్కడ జరిగిన సమావేశంలో పింగళి వెంకయ్య తయారుచేసిన మూడు రంగుల పతాకాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఈ కొండ గాంధీ స్మారక కేంద్రంగా మారింది. 1964 నవంబరు 9న నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తి గాంధీ స్మారక స్థూపానికి శంకుస్థాపన చేశారు. 1968 అక్టోబరు 6న అప్పటి రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ 55 అడుగుల ఎత్తైన స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. 1969లో కొండ చుట్టూ తిరిగేలా మినీ ట్రెయిన్ ట్రాక్ ఏర్పాటు చేశారు. గాంధీజీ జీవిత విశేషాలతో కూడిన పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్లానిటోరియాన్ని కూడా నెలకొల్పారు. చాలాకాలంగా మరుగున పడిపోయిన వీటికి మళ్లీ కళవచ్చింది.










Comments