• Apr 19, 2026
  • NPN Log

    హైదరాబాద్‌: సొంత వేదికపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైనా.. బౌలర్లు బాధ్యత తీసుకున్నారు. జోరు మీదున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లను నియంత్రిస్తూ తమ జట్టును ఆఖరి ఓవర్‌లో గట్టెక్కించారు. దీంతో శనివారం జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో రైజర్స్‌ 10 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఆరు పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. అటు చెన్నైకిది ఆరింట్లో నాలుగో ఓటమి. ముందుగా హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ (22 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59), క్లాసెన్‌ (39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) మాత్రమే రాణించారు. పేసర్లు అన్షుల్‌ కాంబోజ్‌, ఒవర్టన్‌లకు మూడేసి, ముకేశ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులకే పరిమితమై ఓడింది. పేసర్లు ఇషాన్‌ మలింగ 3, నితీశ్‌ 2, శివాంగ్‌, ప్రఫుల్‌, సకీబ్‌ తలో వికెట్‌ తీశారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మలింగ నిలిచాడు.

    తడబడుతూ..: చెన్నై ఛేదన ఆరంభంలో సజావుగా సాగినా.. ఆ తర్వాత తడబాటుకు గురైంది. ఓపెనర్లు సంజూ శాంసన్‌ (7), కెప్టెన్‌ రుతురాజ్‌ (19) విఫలమయ్యారు. కానీ ఆయుష్‌ మాత్రే (13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30) మెరుపులతో పవర్‌ప్లేలో చెన్నై 76/3తో నిలిచింది. కానీ మధ్య ఓవర్లలో రైజర్స్‌ కట్టడి చేసింది. మాథ్యూ షార్ట్‌ (34), సర్ఫరాజ్‌ (25) నాలుగో వికెట్‌కు 46 రన్స్‌ జోడించినా కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు. చివర్లో రైజర్స్‌ బౌలర్లు పట్టు సాధించడంతో శివమ్‌ దూబే (21) క్రీజులో ఉన్నా భారీషాట్లు ఆడలేక వెనుదిరిగాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 18 రన్స్‌ అవసరమవగా.. పేసర్‌ ప్రఫుల్‌ 7 పరుగులే ఇవ్వడంతో చెన్నైకి ఓటమి తప్పలేదు.

     

    జోరుగా ఆరంభమై..: అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ పవర్‌ప్లేలోనే 75 పరుగులతో వహ్వా.. అనిపించింది. స్పిన్నర్‌ మాథ్యూ షార్ట్‌ ఓవర్‌లో అభిషేక్‌ 4,4,4,6,6తో 25 పరుగులు సాధించడంతో 15 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ పూర్తయ్యింది. ఆ తర్వాత హెడ్‌ (20 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23) హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నాడు. కానీ పేసర్‌ ముకేశ్‌ వరుస బంతుల్లో హెడ్‌, ఇషాన్‌ (0)లను అవుట్‌ చేసి షాకిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక మధ్య ఓవర్లలో పేసర్‌ ఒవర్టన్‌.. అభిషేక్‌, అనికేత్‌ (2), నితీశ్‌ (12)ల వికెట్లతో రైజర్స్‌ను అద్భుతంగా కట్టడి చేశాడు. ఈ స్థితిలో వెటరన్‌ క్లాసెన్‌ నిలకడగా ఆడి హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే డెత్‌ ఓవర్లలో చెన్నై పేసర్లు మరింతగా పుంజుకోవడంతో చివరి మూడు ఓవర్లలో సన్‌రైజర్స్‌ 17 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement