జీఎస్టీ సవరణతో రాష్ట్రాలకు ప్రయోజనమే
హైదరాబాద్ : వస్తు సేవల పన్ను(జీఎస్టీ) సవరణతో రాష్ట్రాలకు నికరంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘ఎకోరాప్’ నివేదిక చెబుతోంది. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో లాభమా?, నష్టమా? అనే విషయంపై అన్ని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న వేళ.. ఎస్బీఐ కీలక విషయాలు వెల్లడించింది. మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో.. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు శ్లాబుల స్థానంలో, 12, 28శాతం విభాగాలు తొలగించి, 5,18 శ్లాబులను మాత్రమే ఉంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, జీఎస్టీ రేట్ల సవరణ ద్వారా తెలంగాణకు రూ.7 వేల కోట్ల మేర నష్టం వాటిల్లనుందని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కానీ.. ఈ నష్టం రూ.10 వేల కోట్ల వరకు ఉండొచ్చని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. ఎస్బీఐ మాత్రం రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని, పైగా... నగదు రూపంలో మరింత ప్రయోజనం పొందుతాయని విశ్లేషిస్తోంది. సాధారణంగా మొత్తం జీఎస్టీ వసూళ్లలో కేంద్రానికి 50 శాతం, రాష్ట్రాలకు 50 శాతం నిధులు సమకూరుతాయి. ఇలా రాష్ట్రాలకు సమకూరే 50 శాతం జీఎస్టీలో రాష్ట్రాల నిధులు గతంలో కంటే పెరుగుతాయని ఎస్బీఐ అంచనా వేసింది. జీఎస్ట్టీ హేతుబద్ధీకరణతో ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు రూ 14.10లక్షల కోట్లు అందనున్నాయని తెలిపింది. ఇందులో తెలంగాణకు రూ.8 వేల కోట్ల ప్రయోజనం చేకూరనుందని నివేదిక పేర్కొంది.
Comments