• Apr 19, 2026
  • NPN Log

    బెంగళూరు: విరాట్‌ కోహ్లీ (34 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్స్‌తో 49)తోపాటు బౌలర్లు చెలరేగంతో.. ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) టాప్‌ లేపింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్లతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్జీ)ను చిత్తు చేసింది. తొలుత లఖ్‌నవూ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌ (40), ముకుల్‌ చౌధరి (39), ఆయుష్‌ బదోని (38) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. రసిక్‌ సలామ్‌ 4, భువనేశ్వర్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో బెంగళూరు 15.1 ఓవర్లలో 149/5 స్కోరు చేసి గెలిచింది. కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (27), జితేష్‌ శర్మ (23) రాణించారు. ప్రిన్స్‌ 3, అవేశ్‌ 2 వికెట్లు తీశారు. హాజెల్‌వుడ్‌ (4-0-20-1) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

    బాదుడే బాదుడు: ఛేదనలో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కోహ్లీ విజృంభించడంతో.. బెంగళూరు సులువుగా నెగ్గింది. మరో ఓపెనర్‌ సాల్ట్‌ (7) విఫలమైనా.. కోహ్లీ క్లాస్‌ ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (10) స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ సహకారం అందించాడు. మూడో ఓవర్‌లో షమి బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ బౌండ్రీలు బాదిన విరాట్‌.. ఆ తర్వాతి ఓవర్‌లో ప్రిన్స్‌ బౌలింగ్‌లో మరో 4 ఫోర్లు కొట్టాడు. అనంతరం దిగ్వేష్‌ బౌలింగ్‌లో విరాట్‌ సిక్స్‌ బాదడంతో.. పవర్‌ప్లేను బెంగళూరు 60/1తో ముగించింది. అయితే, 8వ ఓవర్‌లో పడిక్కల్‌ను అవేశ్‌ క్యాచవుట్‌ చేయడంతో.. రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఫిఫ్టీకి పరుగు దూరంలో ఉన్న కోహ్లీని కూడా అవేశ్‌ వెనక్కిపంపాడు. ఈ దశలో పటీదార్‌, జితేష్‌ మూడో వికెట్‌కు 13 బంతుల్లో 35 రన్స్‌ జోడించడంతో.. బెంగళూరు లక్ష్యం దిశగా సాగింది. అయితే, 13వ ఓవర్‌లో పటీదార్‌, జితేష్‌లను ప్రిన్స్‌ అవుట్‌ చేసి షాకిచ్చాడు. కానీ, డేవిడ్‌ (14 నాటౌట్‌), షెపర్డ్‌ (14 నాటౌట్‌) 29 బంతులు మిగిలుండగానే జట్టును గెలిపించారు.

    చెలరేగిన బౌలర్లు: మందకొడి పిచ్‌పై బెంగళూరు బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. పవర్‌ప్లేలో హాజెల్‌వుడ్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో.. ఓపెనర్లు మార్ష్‌, మార్‌క్రమ్‌ (12) కష్టంగా తొలి వికెట్‌కు 32 పరుగులు జోడించారు. సిక్స్‌తో దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన మార్‌క్రమ్‌ను రసిక్‌ అవుట్‌ చేశాడు. కెప్టెన్‌ పంత్‌ (1) రిటైర్డ్‌ హర్ట్‌ కాగా, పూరన్‌ (1)ను హాజెల్‌వుడ్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ దశలో మార్ష్‌, బదోని నాలుగో వికెట్‌కు 38 రన్స్‌ జతచేశారు. కానీ, మార్ష్‌, సమద్‌ (0)ను క్రునాల్‌ అవుట్‌ చేసి దెబ్బకొట్టాడు. 83/4తో ఇబ్బందుల్లో పడిన తరుణంలో బదోనితో కలసి ముకుల్‌ ఐదో వికెట్‌కు 38 రన్స్‌ జోడించాడు. కానీ, బదోనీని రసిక్‌ వెనక్కి పంపడంతో లఖ్‌నవూ బ్యాటింగ్‌ పేకమేడలా కూలింది. మళ్లీ క్రీజులోకి వచ్చిన పంత్‌తోపాటు లిండే (7), షమి (0)ను భువీ పెవిలియన్‌ చేర్చగా..ఆఖరి ఓవర్‌లో ముకుల్‌, అవేశ్‌ ఖాన్‌ (1) వికెట్లను రసిక్‌ తీశాడు.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement