పరగడుపున టీ తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..
మన జీవితంలో 'టీ' అనేది ఒక భాగం అయిపోయింది. పొద్దున్నే టీ తాగనిదే కొందరు ఏ పని మొదలుపెట్టారు. మరికొందరు ఉదయం నుంచి రాత్రి వరకు టీలు తాగుతునే ఉంటారు. టీ తాగితే ఒత్తిడి తగ్గుతోందని, ప్రశాతంగా ఉటుందని భావిస్తుంటారు. మంచి టీ కోసం కిలోమీటర్ల మేర వెళ్లేవారు లేకపోలేరు. అయితే.. ఉదయం నిద్ర లేవగానే పరగడుపున టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. అలాంటి వారు కొంచెం తమ అలవాట్లను మార్చుకోక తప్పదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. ఎసీడీటీ సమస్యకు దారి తీస్తుంది. శరీరంలో పోషకాల శోషణపై ప్రభావం చూపడం వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు.
పరగడుపున టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. తద్వారా ఎసీడీటీ, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఇవి ఒక్కసారి వచ్చేయంటే.. అంత తొందరగా తగ్గవు. టీలో ఉండే కెఫిన్ కడుపులో యాసిడ్ స్థాయిని పెంచుతుంది. జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు కారణమౌతుంది. ఫలితంగా ఆకలి తగ్గిపోతుంది. దీంతో శరీరానికి అవసరమైన పోషణ లభించక పోషకాహార లోపాలు ఏర్పడవచ్చు.
అలాగే.. టీలో ఉండే కెఫిన్ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పటి నుంచో ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు వారిలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. రక్తహీనత వంటి సమస్యలు తలెత్తడానికి ఇది ఒక కారణం. అధికంగా టీ తాగడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరుగుతాయి. పరగడుపున టీ తాగినప్పుడు ఈ ప్రభావం మరింత తీవ్రమౌతుంది. మానసిక కల్లోలం, చిరాకు, నిద్రలేమి సమస్యలకు దారితీస్తుంది.
అంతేకాకుండా.. టీలోని కెఫిన్ మూత్రవిసర్జన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరం నుంచి నీటిని తొలగిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. చర్మ సమస్యలు, అలసట, బలహీనత వంటివి చుట్టుముడతాయి. టీలోని ఆమ్లాలు చక్కెరతో కలిసినప్పుడు, నోటిలో ఆమ్ల స్థాయిలను పెంచుతాయి. ఇది దంతాల ఎనామెల్‌ను నాశనం చేస్తుంది.
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారి దీర్ఘకాలంలో ఎముకలు బలహీనపడవచ్చు. పరగడుపున టీ తాగే అలవాటు క్రమంగా దీర్ఘకాల ఆరోగ్యానికి దారీ తీస్తోందని నిపుణులు సూచిస్తున్నారు. అల్పాహారం తర్వాత టీ తాగడం చాలా మంచిదని అంటున్నారు. కనీసం బన్, బ్రెడ్ లేదా బిస్కట్ల వంటితో కలుపుకొని టీ తాగినా ఫర్వాలేదని పేర్కొన్నారు. దీని వల్ల కెఫిన్ తీవ్రత కొంతవరకు తగ్గుతోందని చెప్పారు. ఒకవేళ ఖాళీ కడుపుతోనే టీ తాగాలని అనిపిస్తే.. హెర్బల్ టీ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
Comments