మస్క్‌ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్
న్యూయార్క్: అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఒరాకిల్ సహ-వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ ప్రపంచ ధనవంతుల జాబితాలో టెస్లా సారథి ఎలాన్ మస్క్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకారు. ఫోర్బ్స్ రియ ల్ టైం బిలియనీర్స్ లిస్ట్ ప్రకారం.. 81 ఏళ్ల ఎల్లిసన్ వ్యక్తిగత సంపద బుధవారం ఏకంగా 10,100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8.89 లక్షల కోట్లు) పెరిగి మొత్తం రూ.39,570 కోట్ల డాలర్లకు (రూ.34.82 లక్షల కోట్లు) చేరుకుంది. ఒరాకిల్ షేరు ఒక్కరోజే ఏకంగా 41 శాతం పెరగడం ఇందుకు దోహదపడింది. 1992 తర్వాత ఒక్క రోజులో కంపెనీ షేరు ఇంత భారీగా పెరగడం ఇదే ప్రథమం. దాంతో ఒరాకిల్ మార్కె ట్ విలువ 29,900 కోట్ల డాలర్ల మేర పెరిగి లక్ష కోట్ల డాలర్లకు చేరువైంది. ప్రస్తుతం సంస్థ లో ఎల్లిసన్ 41 శాతం వాటా కలిగి ఉన్నారు. ఒరాకిల్ త్రైమాసిక పనితీరు మార్కెట్ అంచనాలను మించడంతోపాటు క్లౌడ్ వ్యాపారం భవిష్యత్‌పై అత్యంత ఆశావహ అంచనాలను విడుదల చేయడం కంపెనీ షేర్లు భారీగా ర్యాలీ తీశాయి. కాగా, ప్రపంచ కుబేరుల జాబితాలో 300 రోజులుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన మస్క్ రెండో స్థానానికి జారుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 38,500 కోట్ల డాలర్లకు (రూ.33.88 లక్షల కోట్లు) పరిమితమైంది.
Comments