వికిపీడియాను చూసే జనాల సంఖ్య తగ్గుతోంది: వికిమీడియా ఫౌండేషన్ సీనియర్ డైరెక్టర్
ఇంటర్నెట్పై ఏఐ ప్రభావం అమితంగా ఉంది. ఒకప్పుడు సమాచారం కోసం నెట్లో వెబ్‌సైట్స్‌ను చూసేవాళ్లు ప్రస్తుతం చాట్‌జీపీటీ లాంటి జెనరేటివ్ ఏఐ ఆధారిత చాట్బాట్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక సెర్చ్ ఇంజన్లల్లో కూడా ఏఐ ఫీచర్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో వికిమీడియా ఫౌండేషన్ సంస్థలోని (వికిపీడియా మాతృసంస్థ) సీనియర్ డైరెక్టర్ మార్షల్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలు టెక్ రంగంలో చర్చకు దారి తీశాయి
వికిపీడియాను సందర్శించే నెటిజన్ల సంఖ్య తగ్గిందని మార్షల్ మిల్లర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే 8 శాతం మేర తగ్గిందని చెప్పారు. మే, జూన్ నెలల్లో వెబ్‌సైట్‌కు పెరిగిన ట్రాఫిక్‌కు కారణం ఏమిటని అన్వేషించగా ఏఐ బాట్స్ వల్ల వ్యూస్ పెరిగినట్టు తేలిందని అన్నారు. వికిపీడియాను సందర్శించే ఏఐ బాట్స్‌ను గుర్తించేందుకు సాఫ్ట్‌వేర్‌ను మెరుగు పరచగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పారు. సాధారణ నెటిజన్లు సైట్‌ను సందర్శించినట్టు కనిపించేలా ఈ బాట్స్‌ను డిజైన్ చేశారని తెలిపారు. ఇవి నేరుగా సమాచారాన్ని సేకరించి నెటిజన్లకు అందిస్తున్నాయని అన్నారు.
జనరేటివ్ ఏఐ మోడల్స్, సోషల్ మీడియా వచ్చాక ప్రజలు సమాచారాన్ని సేకరించే విధానంలో మార్పులు వచ్చాయని మార్షల్ తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఇంజెన్లు కూడా జనరేటివ్ ఏఐని వినియోగిస్తూ నెటిజన్లకు కావాల్సిన సమాచారాన్ని అవే సేకరించి నేరుగా ఇస్తున్నాయని తెలిపారు. ఇక యువతరం ప్రస్తుతం తమ సమాచారం కోసం ఇంటర్నెట్ ఓపెన్ వెబ్‌కు బదులుగా సోషల్ మీడియాలోని షార్ట్స్, రీల్స్ వంటి వాటిపై ఆధారపడుతోందని చెప్పారు.
కొత్త మార్గాల్లో ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడం ఆహ్వానించదగ్గదేనని అన్నారు. ఈ పరిణామంతో వికిపీడియా ప్రాముఖ్యత ఏమీ తగ్గదని కూడా చెప్పారు. అయితే, ఈ సమాచారం ఎక్కడ నుంచి వస్తోందో ప్రజలకు తెలియకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వికిపీడియాలో కంటెంట్‌ను అప్డేట్ చేసే వారి సంఖ్య తగ్గిపోవచ్చని అన్నారు. కాబట్టి వికిపీడియాలోని కంటెంట్‌ను వాడే ఏఐ, సెర్చ్ ఇంజెన్లు.. కొంత ట్రాఫిక్‌ను తమ వైపునకు మళ్లించాలని సూచించారు. కంటెంట్ క్రియేషన్‌కు, సమగ్రతకు ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్లో తాము వెతుకుతున్న సమాచారానికి సంబంధించిన సైటేషన్స్, ఒరిజినల్ లింక్స్‌పై క్లిక్ చేయాలని సూచించారు.
Comments