1.10 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
చీరాల : ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎంతలా అవగాహన కల్పించినా వారి వలలో ప్రజలు పడుతూనే ఉన్నారు. తాజాగా ఏలూరు మెడికల్ కళాశాల ప్రొఫెసర్ నుంచి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో డబ్బు కొట్టేశారు. ఆయన భార్య ఖాతా నుంచి ఏకంగా రూ. కోటి, ఆయన ఖాతా నుంచి రూ. 10 లక్షల నగదును తమ బ్యాంకు ఖాతాకు బదిలీ చేయించుకున్నారు. బాధితుడు శుక్రవారం రాత్రి చీరాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్ నేరగాళ్ల దోపిడీ వెలుగులోకి వచ్చింది. చీరాల వన్‌టౌన్ సీఐ సుబ్బారావు కథనం ప్రకారం, బాపట్ల జిల్లా చీరాలకు చెందిన విశ్రాంత ప్రభుత్వ వైద్యుడు ఏలూరు మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 9న ఆయనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయడంతోనే తాము ముంబై పోలీసులమని అవతలి వ్యక్తులు చెప్పారు. తర్వాత వీడియో కాల్ చేసి మనీ లాండరింగ్ కేసు పెడతామంటూ ప్రొఫెసర్‌ను బెదిరించారు. కేసు పెట్టకుండా ఉండాలంటే తమ ఖాతాకు లావాదేవీలు జరగాలంటూ నమ్మబలికారు. దర్యాప్తు అధికారి ప్రణయ్ సార్ ఖాతాకు రూ. 1.10 కోట్లు జమ చేయాలని చెప్పారు. ఆర్బీఐ పరిశీలన అనంతరం ఆ డబ్బు తిరిగి వచ్చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇదంతా నమ్మిన ప్రొఫెసర్.. నేరగాళ్లు చెప్పిన ఖాతాకు విడతల వారీగా సొమ్ము బదిలీ చేశారు. ఆ వెంటనే ‘మీ నగదు పరిశీలన పూర్తయింది‘ అంటూ ఆర్‌బీఐ పేరుతో మెసేజ్ కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత తన ఖాతాకు డబ్బు తిరిగి జమకాకపోవడం, అవతలి వ్యక్తుల నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయినట్లు ప్రొఫెసర్ గుర్తించారు. శుక్రవారం రాత్రి చీరాల వన్‌టౌన్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments