• Mar 02, 2026
  • NPN Log

    విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వెనక్కి పయనమైంది. మూడు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం వరకూ వచ్చింది. ఆ తర్వాత ఈశాన్యంగా దిశ మార్చుకుని సోమవారం మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి తొలుత ఈశాన్యంగా ఆ తర్వాత తూర్పుగా పయనించి మంగళవారానికి తిరిగి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించింది. రానున్న 24 గంటల్లో తూర్పుదిశగా పయనించి క్రమేపీ బలహీనపడనుంది. అల్పపీడనం ఏర్పడిన ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పయనమైన తర్వాత తిరిగి వెనక్కి రావడం అరుదుగా జరుగుతుంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడగా.. అందులో ఒకటి శ్రీలంక సమీపాన బలహీనపడింది. మరొకటి ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ వాయవ్యంగా పయనించి తిరిగి దిశ మార్చుకుని అదే ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించడం వాతావరణంలో జరుగుతున్న మార్పులకు సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా సోమవారం పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు విస్తరించిన ఉపరితలద్రోణి.. మంగళవారానికి పశ్చిమ బెంగాల్‌ నుంచి ఒడిశా వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమగాలులు వీస్తూ వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement