• Mar 01, 2026
  • NPN Log
          
          
          
          
          

    • విశాఖపట్నం

    - అనకాపల్లిలో కలెక్టర్ 'భూ' బాగోతం.
    - వంద కోట్ల దేవుడి భూమి కైంకర్యం
    - దేవుడి భూమిపై కలెక్టర్ కన్ను 
    - కలెక్టర్ అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలి
    : వైయస్సార్సీపీ నేతలు డిమాండ్.

    విశాఖపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ , మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, అదీప్ రాజ్, అనకాపల్లి సమన్వయకర్త భరత్.

    - కంచె చేను మేస్తే ఎలా? 
    - దేవుడు భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా కట్టబెడతారు?
    - హిందూ ధర్మం అంటే దేవుడి భూములను దోచుకోవడమేనా?
    - లడ్డూపై రాజకీయం చేసే నేతలకు ఈ భూ దోపిడీ కనిపించడం లేదా?
    - వంద కోట్ల భూమి.. వారం రోజుల్లో ఫైల్ క్లియర్
    - కూటమి నేతల కనుసన్నల్లో కలెక్టర్ అవినీతి కాసుల వేట
    : ఆగ్రహం వ్యక్తం చేసిన వైయస్సార్సీపీ నేతలు


    విశాఖపట్నం:

    అనకాపల్లి జిల్లాలో దేవాదాయ శాఖకు చెందిన వంద కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ జిల్లా కలెక్టర్ అత్యంత వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు, వైయస్సార్సీపీ నేతలతో కలిసి కలెక్టర్ సాగిస్తున్న భూదోపిడీని ఆధారాలతో సహా బయటపెట్టారు. అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉన్న కన్యాకా పరమేశ్వరి దేవాలయానికి చెందిన భూమిని జిల్లా కలెక్టర్ అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని అమర్నాథ్ ఆరోపించారు. 111 ఏళ్ల క్రితం (1915లో) దూరి కామమ్మ అనే మహిళ బ్రాహ్మణ సత్రం కోసం 2.49 ఎకరాల భూమిని దానమిచ్చిన భూమి దేవాదాయ శాఖది కాదని, ప్రైవేటు వ్యక్తులదని కలెక్టర్ తప్పుడు నివేదిక ఇచ్చారని మండిపడ్డారు. దేవాదాయ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదని, కేవలం ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే ఏదైనా జరగాలని గుర్తు చేశారు. కానీ ఆఘమేఘాలమీద కూటమి ప్రభుత్వం రాగానే కేవలం రెండు వారాల్లోనే తాసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు చేరడం వెనుక భారీ కుంభకోణం ఉందని గుడివాడ అమర్నాధ్ స్పష్టం చేశారు. మరోవైపు  జిల్లా మెజిస్ట్రేట్ హోదాలో ఉండి ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన కలెక్టర్, కాసుల కోసం కక్కుర్తి పడి కంచె చేను మేసినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మండిపడ్డారు.  గడిచిన 20 నెలలుగా అనకాపల్లి కలెక్టర్ తీసుకున్న ప్రతి రెవెన్యూ నిర్ణయం మీద సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దేవుడి భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే పెద్ద ఎత్తున న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే...

    ● రూ. 100 కోట్ల భూ స్కామ్ - గుడివాడ అమర్నాధ్, మాజీ మంత్రి.

    గడిచిన రెండేళ్లగా ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కూటమి నేతలు.. తిరుమల లడ్డూతో పాటు రాష్ట్రంలోని ఆలయాలు, ఆలయ భూములు వంటి కేవలం మతాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనకాపల్లి పట్టణం నడిబొడ్డున  జిల్లా కలెక్టర్ రూ.100 కోట్ల విలువైన దేవాదాయ ధర్మాదాయశాఖ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. 1915లో దూరి కామమ్మ అనే మహిళ కన్యకా పరమేశ్వరి దేవాలయానికి సత్రం కోసం 2.49 భూమిని దానంగా ఇచ్చారు. 1971 లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలోకి ఈ భూమి వచ్చింది. 2.49 ఎకరాల భూమిలో ఎకరా 38 సెంట్లు భూమి మార్కెట్ యార్డ్ కోసం తీసుకున్నారు. ఇంకా ఎకరా 11 సెంట్లు భూమి మిగిలింది. ఈ భూమిని కాండ్రేగుల సూరప్పారావుకు కౌలుకు అధికారులు ఇచ్చారు. 2025 సెప్టెంబర్ 21న దేవాదాయ శాఖ భూమి కాదు ప్రైవేటు భూమి అని చెప్పి కలెక్టర్ నివేదిక ఇచ్చారు. కలెక్టర్ కు దేవాదాయ శాఖ భూమిని ప్రైవేటు వ్యక్తులకు  ఇచ్చే అధికారం లేదు.

    దేవాదాయ, ధర్మాదాయశాఖ భూమి పొరపొటున ఇతరుల రికార్డులలో పడినా దాన్ని జిల్లా కలెక్టర్ ఎండోమెండ్ కమిషనర్ కి కానీ, పై అధికారులకు కానీ పంపిస్తే పరీక్షించి వారు కలెక్టర్ కి అనుమతి ఇస్తే తప్ప దాన్ని కట్టబెట్టడానికి అధికారం లేదు. ఇందులో ప్రధాన ముద్దాయి అనకాపల్లి జిల్లా కలెక్టరే. ప్రభుత్వ ఆధీనంలో   ఉన్న దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన భూమిని అడ్డగోలుగా ప్రవైటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. 1ఈ భూమి కౌలుదారుడి పేరుమీద పాస్ బుక్ ఉన్నా ఇవేవీ జిల్లా కలెక్టర్ కి కనబడలేదు. ఒకవైపు హిందుత్వం గురించి, మతం, ఆలయాల గురించి కూటమి ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూనే ఉన్నారు. మరోవైపు భారీ ఎత్తున దేవుడి భూములు కైంకర్యం అవుతున్నాయి. తొలిసారిగా దేశంలోనే అత్యున్నత ఐఏఎస్ అధికారి ఈ తరహా పనులు చేస్తుంటే...  వ్యవస్థలు ఏమైపోతున్నాయి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ గా వచ్చి దాదాపు 20 నెలలు పూర్తవుతున్నాయి. జిల్లా అభివృద్ధిపై మీ మార్కు ఎక్కడా కనబడలేదు.

    - అడుగడుగునా విఫలమైన కలెక్టర్..

    చోడవరం షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గా ఉన్న ఈ జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత 65 ఏళ్ల చరిత్రలో  తొలిసారి నిల్చిపోయింది. గతేడాది రూ.36 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదు.  ప్రైవేటు ఫ్యాక్టరీలకు చెరుకును రైతులు సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం టన్ను చెరకు ధర రూ.3,300 నిర్ణయిస్తే.. రైతుకు మాత్రం రూ.2800 ఇస్తున్నారు. రైతులకు అన్యాయం జరుగుతున్నా కలెక్టర్ మాత్రం జోక్యం చేసుకోవడం లేదు. దాదాపు అనకాపల్లి, మాడుగుల, చోడవరం నుంచి దాదాపు లక్ష టన్నుల చెరకు ప్రైవేటు ఫ్యాక్టరీలకు వెళ్తుంది. అయినా కలెక్టర్ నోరు మెదపడం లేదు. టన్ను దగ్గర రైతులకు రూ.500 నష్టపోతుంటే.. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి.?
    ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. వైయస్సార్సీపీ తరపున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. గడిచిన 20 నెలలుగా అనకాపల్లి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాల మీద సీబీఐ విచారణ చేయించాలి. అనకాపల్లి నడిబొడ్డున గజం రూ.1.50 లక్షలు నుంచి రూ.2 లక్షలు విలువ చేసే చోట దాదాపు 6వేల గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు జిల్లా కలెక్టర్ ధారదత్తం చేస్తున్నారు.  ఇందులో మీరు ఏ రకంగా లబ్ది పొందారు. ఎలాంటి లబ్ది లేకుండా ఇలాంటి అడ్డగోలు నిర్ణయాన్ని ఎలా తీసుకుంటారు?

    - ఆగమేఘాల మీద పైల్ అక్రమ ప్రయాణం..

    ఈ భూమి కోసం 06-09-2022లో కౌలురైతు భార్య కాండ్రేగుల చిన్నతల్లి దరఖాస్తు పెట్టారు. దేవస్థానం భూమి మీదకు వెళ్లడానికి మా ప్రభుత్వంలో ఎవరూ సిద్దపడలేదు. ప్రస్తుత కలెక్టర్ అనకాపల్లి జిల్లాకు వచ్చిన తర్వాత ఈ ఫైల్ ఆగమేఘాల మీద కదిలింది. జూన్ 04 2024న ప్రభుత్వం అధికారంలోకి వస్తే... తాసీల్దార్ 21-06-2024నాడు ఈ  ఫైల్ కేవలం రెండు వారాల్లోనే కదిలింది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో తాసీల్దార్ నుంచి ఆర్డీఓ వరకు 3 నెలలు పడుతుంది. ఈ ఫైల్ మాత్రం వారం రోజుల వ్యవధిలోనే చేరింది. 
    1915లో ఈ భూమిని దేవాదాయశాఖకు ఎవరు దానం చేశారు? అన్నది రికార్డులలో చాలా స్పష్టం ఉంది. ఆ విషయాన్ని గుర్తించకపోగా, అదేదో 22-ఏ లో పొరపాటున నమోదైనట్లు కలెక్టర్ అయిన కొద్ది రోజుల్లోనే  ఆ ఫైల్ క్లియర్ చేశారు. 22-ఏ నుంచి డిలీట్ చేయమని జిల్లా రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. దీనికోసం కలెక్టర్ నుంచి రిజిస్ట్రార్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా తెలిసింది. దిగువ స్థాయి అధికారులు ఇలాంటి పొరపాట్లు చేస్తే... సరిదిద్దాల్సిన జిల్లా కలెక్టరే ఇలాంటి తప్పులు చేస్తే వైయస్సార్సీపీ చూస్తూ ఉపేక్షించదు. కచ్చితంగా దీనిమీద పోరాటం చేస్తాం. బాధ్యత గల ప్రతిపక్షంగా దీన్ని చూస్తూ ఊరుకునేది లేదు. పేదల సమస్యల మీద స్పందించడానికి టైం లేని ఈ జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వని ఈ కలెక్టర్... నాలుగు గోడల మధ్య ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డాన్ని వైయస్సార్సీపీ చూస్తూ ఉపేక్షించేదు. ఆమె చేసిన ప్రతి రెవెన్యూ నిర్ణయం మీద సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో న్యాయపోరాటం తధ్యమని హెచ్చరించారు. కంచె చేను మేస్తే సామాన్యుడి భూములకే ఏం రక్షణ ఉంటుందని అమ్నరాధ్ నిలదీశారు.

    ● కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే.

    అనకాపల్లి జిల్లాలో దేవాదాయశాఖ భూములు ఆవిరైపోతున్నాయి. కలెక్టరేట్ లో అవినీతి కాసులు గలగలలాడుతున్నాయి.  గత 20 మాసాలుగా జిల్లా మెజిస్ట్రేట్ గా ఉన్న వ్యక్తి , ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన వ్యక్తే అధికారం చేతిలో ఉందని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం దారుణం. ఐఏఎస్ వ్యవస్థకే ఇలాంటి వ్యక్తులు కళంకం తెస్తున్నారు. కూటమి నేతలు రాజకీయ లబ్ది కోసం ఒకవైపు దేవుడ్ని, మతాన్ని వాడుకుంటుంటే.. మరోవైపు అధికారులు ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డం దారుణం. సత్రం కోసం దానమిచ్చిన భూమిని గతంలో కూడా టీడీపీ నేతలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే దాన్ని కూడా మేం అడ్డుకున్నాం. సాధారణంగా భూమి దానమిచ్చిన వారి వారసులు ముందుకు రావడం సహజం.. కానీ కౌలుదారులు ఎలా మందుకు వస్తారు, వారికి  ఏ విధంగా ఈ భూమిని కట్టబెడతారు? వంద కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమవుతుంటే.. అధికారపార్టీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇన్నేళ్లలో ఇంతటి వివాదాస్పద కలెక్టర్ ను ఎప్పుడూ చూడలేదు? రాజకీయ పార్టీ నేతల తరహాలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం ఎంతవరకు సమంజసం? టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు సన్నిహితులైన మురళీ, ఇతర టీడీపీ నేతలతో అంటకాగుతూ అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు. ఇంత భారీ భూకుంభకోణం జరుగుతున్నా రెవెన్యూ మంత్రి మౌనంగా ఉన్నారంటే.. ఈ అక్రమార్జనలో మీక్కూడా వాటాలున్నాయా? సమాధానం చెప్పాలి. వందకోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఈ భూమిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దీనికోసం వైయస్సార్సీపీ పోరాటం చేస్తుందని ధర్మశ్రీ హెచ్చరించారు.

    ● మలసాల భరత్, అనకాపల్లి సమన్వయకర్త.

    అనకాపల్లి జిల్లా కేంద్రంలో రూ.100 కోట్ల విలువైన దేవాదాయశాఖ భూములను కొంతమంది అక్రమార్కులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర అధికారులు అక్రమార్కులకు వత్తాసు పలకడం దారుణం. 22 సీ లో ఉన్న ఈ సత్రం భూమని  22 ఏ లోకి మార్చి... తద్వారా అధికార పార్టీకి కావాల్సిన వారికి కట్టజెప్పే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఇందులో సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పాత్ర ఉండడం మరింత విచారకరమన్న భరత్.... దీనిపై సీబీఐతో విచారణ చేయించి, బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement