• Apr 19, 2026
  • NPN Log

    భారత క్రికెట్‌లో అగ్రశేణి బ్యాటర్‌గా వెలుగొందిన వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మెదడులో క్లాట్ ఏర్పడటంతో భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదముందని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని కాంబ్లీ స్నేహితుడు మార్కస్ కౌటో ధ్రువీకరించారు. ప్రస్తుతం కాంబ్లీ కోలుకుంటున్నప్పటికీ పూర్తిగా ఆరోగ్యవంతుడిగా లేడని వెల్లడించారు. 90వ దశకంలో భారత జట్టులోకి అడుగుపెట్టిన వినోద్ కాంబ్లీపై భారీ అంచనాలు ఉండేవి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అతడు బాల్యమిత్రుడు.

    గతేడాది కిడ్నీ సంబంధిత ఇన్ఫెక్షన్, కండరాల నొప్పులతో థానేలోని ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. అప్పట్లో అతడి ఆరోగ్యంపై పెద్ద చర్చ జరిగింది. సునీల్ గావస్కర్, కపిల్ దేవ్ వంటి దిగ్గజ ప్లేయర్లు కాంబ్లీకి ఆర్థిక సాయం కూడా చేశారు. తాజాగా కాంబ్లీ స్నేహితుడు చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ‘కాంబ్లీకి మెదడులో క్లాట్ ఏర్పడింది. అది తొలగించడం సాధ్యం కాలేదు. వైద్యుల చెప్పినదాని ప్రకారం అతడికి భవిష్యత్తులో బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు. ఆయన జ్ఞాపకశక్తి కూడా సరిగ్గా లేదు. చాలా విషయాలు ఆయన మర్చిపోయాడు. కాంబ్లీ ప్రస్తుతం మద్యం పూర్తిగా మానేశాడు. కానీ అప్పుడప్పుడు సిగరెట్ కోసం ఇతరులను అడుగుతూ ఉంటాడు. ఆయన సమస్య అంతా మెదడులోనే ఉంది’ అని కాంబ్లీ స్నేహితుడు వివరించాడు.

    వినోద్ కాంబ్లీ భారత్ తరఫున 104 వన్డేలు, 17 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. చెడు వ్యసనాల కారణంగా పీక్ స్టేజీలో ఉన్న అతడి కెరీర్.. అనూహ్యంగా దిగజారిపోయింది. మద్యం, ధూమపానం మితిమీరి తీసుకోవడం వల్లే ఆయన అనారోగ్యం పాలయ్యారని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement