• Apr 05, 2026
  • NPN Log

    హైదరాబాద్‌  : ఉప్పల్‌ స్టేడియంలో త్వరలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లకు 2వేల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఉప్పల్‌ డీసీపీ సురేష్‌ తెలిపారు. స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 5 నుంచి 22 వరకు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు సంబంధించి స్టేడియం పరిసరాల్లో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌, సెక్యూరిటీ వింగ్‌, ఏఆర్‌, మోంటెడ్‌ పోలీస్‌, విభాగాల నుంచి సిబ్బందిని బందోబస్తు విధుల్లో నియమించినట్లు తెలిపారు.

    అంతేకాకుండా స్టేడియంలో మహిళా ప్రేక్షకుల రక్షణ కోసం సివిల్‌ దుస్తుల్లో షీటీమ్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. స్టేడియం లోపల, బయట మొత్తం 430 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఈ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. స్టేడియం లోపలికి వెళ్లేవారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. అత్యవసర వైద్య సేవల కోసం స్టేడియం వద్ద 5 అంబులెన్స్‌లు, అగ్ని ప్రమాదాల నివారణకు 4 ఫైర్‌ ఇంజన్లను సిద్ధంగా ఉంచామన్నారు. టికెట్‌లు ఉన్న వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని, ఇతరులు వచ్చి రద్దీని పెంచవద్దని కోరారు.

    పార్కింగ్‌ ..

    ఐపీఎల్‌ మ్యాచ్‌ వీక్షణకు వచ్చే వారి వాహనాల కోసం పలు పార్కింగ్‌ ప్రదేశాలు కేటాయించారు. హబ్సిగూడ వైపు నుంచి వచ్చేవారికి పెంగ్విన్‌ గ్రౌండ్స్‌, టీజీఐఏఎల్‌ఏ ప్రాంగణంలో, రామాంతపూర్‌ వైపు నుంచి వచ్చేవారికి డీఎస్ఎల్‌లో పార్కింగ్‌కు కేటాయించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రేక్షకులు మెట్రో రైలు లేదా ఆర్‌టీసీ బస్సులను ఉపయోగించాలని అధికారులు కోరారు.

    ట్రాఫిక్‌ మళ్లింపులు..

    మ్యాచ్‌ జరిగే రోజుల్లో ఉప్పల్‌ స్డేడియానికి వెళ్లే రూట్లలో భారీ వాహనాలైన లారీలు, ట్రక్కులు, టిప్పర్లు, ప్రైవేట్‌ బస్సులను అనుమతించరు. ఘట్‌కేసర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే భారీ వాహనాలను మెహిఫిల్‌ హోటల్‌ వద్ద నాగోల్‌, ఎల్బీనగర్‌ వైపు మళ్లిస్తారు. ఎల్బీ నగర్‌ నుంచి వచ్చే వాహనాలను నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద మళ్లిస్తారు. తార్నాక/హబ్సిగూడ, రామంతాపూర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను నాచారం, చర్లపల్లి వైపు మళ్లిస్తారు. వరంగల్‌ వైపు వెళ్లే వారు ఓఆర్‌ఆర్‌ మీదుగా ప్రయాణించాలని కోరారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement