కురుపాం విద్యార్థినుల కుటుంబాలకు వైసీపీ సాయం
పార్వతీపురం : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు బాలికలు ఇటీవల పచ్చకామెర్లతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం కురుపాం మండలం దండుసూర గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆర్థిక సాయం అందించారు. మృతి చెందిన బాలికలు కల్పన, అంజలి తల్లులు జయమ్మ, భవానికి వైసీపీ తరఫున రూ.5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ‘ప్రభుత్వం ఒక్కో బాలిక కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలి. మన్యంలో బాలికల మరణాలను అరికట్టడంలో అధికారులు, జిల్లాలో ఉండే మంత్రి, కురుపాం ఎమ్మెల్యే విఫలమయ్యారు. కురుపాం గురుకులంలో చదువుతున్న బాలికలకు పూర్తిగా వైద్య పరీక్షలు జరిపి ఆ రిపోర్టులను వారి తల్లిదండ్రులకు అందజేయాలి. ఈ సంఘటనపై ఎన్హెచ్ఆర్సీ, ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశాం’ అని బొత్స చెప్పారు. మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్న దొర మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలో గత 18 నెలల్లో 15 మంది బాలలు చనిపోయారన్నారు. కాగా, పార్వతీపురం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం గురుకులం, ఏకలవ్య పాఠశాలల విద్యార్థినులను ఎమ్మెల్సీ బొత్స పరామర్శించారు.
Comments