• Oct 18, 2025
  • NPN Log

    బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా హన్మకొండ యూనివర్సిటీలోని ఎస్ డి ఎల్ సిలో గల మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి మహేందర్ గౌడ్ పూలమాల వేశారు. అనంతరం యూనివర్సిటీ క్రాస్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు సకలజనులు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాల పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకొని..బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం..ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే..మరో ఆర్డినెన్స్ తేవడం..ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే..జీవో 9 ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోరా తప్పిదమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం..5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలా చేసినప్పుడే బీసీలకు సముచిత న్యాయం దక్కుతుందన్నారు. అదేవిధంగా బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ బీసీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడని, బీసీల పాపం బిజెపికి తగులుతుందని, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ పిలుపులో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని బిజెపి బీసీలంటే బానిసలుగా చూస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు రాణించాలంటే చట్టసభలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, ఇందుకు బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపిని బొంద పెట్టడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 18 శాతానికి కుదించిన బీఆర్ఎస్ పార్టీ బంద్ లో పాల్గొని బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. సకల జనులు కలిసి బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో ఆలోచించకుండా..అన్ని పార్టీలు ఏకమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ యూనివర్సిటీ నుండి ములుగు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement