• Oct 26, 2025
  • NPN Log

    వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనంపై కాంగ్రెస్‌ స్పందించింది. అదానీ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఎల్‌ఐసీ నిధులను దుర్వినియోగం చేయడంపై పార్లమెంటరీ కమిటీ అయిన పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీతో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేసింది. ఆర్థిక శాఖ, నీతి ఆయోగ్‌ కలిసి అదానీ గ్రూప్‌ మీద ఆర్థిక సంస్థల్లో విశ్వాసం పెంచేందుకు ఈ స్కెచ్‌ వేశాయని వ్యాఖ్యానించింది. 30 కోట్ల మంది ఎల్‌ఐసీ వాటాదారుల కష్టార్జితాన్ని మోదీ దుబారా చేస్తున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. తమ కష్టార్జితాన్ని మోదీ ఇలా అదానీని ఒడ్డున పడేయడానికి వాడుతున్నారని తెలుసా? అని ప్రశ్నించారు. ఇది తీవ్రమైన నేరమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు. ఎవరి ఒత్తిడితో అధికారులు ఒక ప్రైవేటు కంపెనీని రక్షించే కార్యక్రమానికి పూనుకున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాయకులు ఫోన్లు చేస్తే అధికారులు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. గత ఏడాది అమెరికాలో అదానీ మీద ఆరోపణలు వచ్చినపుడు కంపెనీ షేర్లు ఘోరంగా పడిపోయాయని, ఒక్క ఎల్‌ఐసీకే రూ.7,850 కోట్ల నష్టం వచ్చిందని ప్రస్తావించారు. అదానీ రెండు వేల కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చి అనుమతులు సంపాదించారని స్వయంగా అమెరికా ప్రభుత్వమే ఆరోపించిందని చెప్పారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణ జరగాల్సిందేనని అన్నారు. మొదటి అడుగుగా పబ్లిక్‌ ఎకౌంట్స్‌ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. అదానీ సంస్థకు అమెరికా సెక్యూరిటీస్‌ కమిషన్‌ నోటీసులు పంపిస్తే వాటిని సర్వ్‌ చేయడానికి మోదీ ఏడాది కాలంగా అంగీకరించడం లేదన్నారు. ఇది కేవలం ఎల్‌ఐసీ వ్యవహారం కాదని, ఇదొక ‘మొదానీ మెగా స్కామ్‌’ అని వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖ ఇలా అన్ని ప్రభుత్వరంగ సంస్థలతో ఒత్తిడి తెచ్చి ప్రైవేటు సంస్థలను తమ ఆస్తులను అదానీకి అమ్ముకునేట్లు చేస్తున్నారని ఆరోపించారు. విదేశాల్లో అదానీ ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన మద్దతు ఇస్తోందని, బొగ్గు దిగుమతుల్లో ఎక్కువ ధరలను చూపిస్తూ విదేశాలకు పెద్దమొత్తం నిధులు తరలిస్తున్నారని, రాష్ట్రాల్లో లంచాలిచ్చి అత్యధిక ధరలకు విద్యుత్‌ సరఫరా కాంట్రాక్టులు సంపాదిస్తున్నారని జైరాం రమేశ్‌ చెప్పారు.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).