పాక్ క్రికెట్‌లో సంక్షోభం.. నఖ్వీ రాజీనామా చేయాలని అఫ్రీది డిమాండ్..
ఆసియా కప్‌లో భారత జట్టు చేతిలో వరుసగా మూడు సార్లు ఓడిపోవడం పాకిస్థాన్ క్రికెట్‌లో సంక్షోభానికి కారణమవుతోంది. ముఖ్యంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాక్ క్రికెట్ అభిమానులతో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్లు కూడా నఖ్వీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నఖ్వీ రాజీనామా చేయాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది డిమాండ్ చేశాడు.
ఒకవైపు క్రికెట్ బోర్డు చీఫ్‌గా, మరోవైపు పాకిస్తాన్ హోంమంత్రిగా రెండు కీలక పదవులను నఖ్వీ నిర్వహించడం సరికాదని, క్రికెట్‌కు పూర్తి స్థాయి శ్రద్ధ అవసరమని అఫ్రిది పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో పాక్ జట్టు ఘోర పరాజయం, ట్రోఫీ చుట్టూ జరిగిన వివాదాల నేపథ్యంలో అఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంలో కూడా నఖ్వీకి అఫ్రీది ఇలాంటి సలహానే ఇచ్చాడు. నఖ్వీ నిర్వహిస్తున్న రెండూ పదవులు చాలా ముఖ్యమైనవని, ఈ రెండింటికీ చాలా శ్రద్ధం, సమయం అవసరమని చెప్పాడు.
'నఖ్వీ ప్రస్తుతం రెండు ముఖ్యమైన పదవుల్లో ఉన్నారు. హోం మంత్రిత్వ శాఖ, క్రికెట్ బోర్డ్.. రెండూ వేర్వేరు ప్రపంచాలు. ఈ రెండింటినీ ఒకరు హ్యాండిల్ చేయడం కుదరదు. పాక్ క్రికెట్ కోసం చాలా సమయం వెచ్చించాలి. సలహాదారులపై ఆధారపడితే పని జరగదు. తనకు క్రికెట్ గురించి తెలియదని నఖ్వీనే పలుసార్లు చెప్పారు. సమర్థుడైన వ్యక్తికి పీసీబీ ఛీఫ్ పదవి అప్పగించాలి' అని అఫ్రీది డిమాండ్ చేశాడు.
Comments