పట్టుమని 15 మందీ లేరే...
రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య పెరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి 7 వేలలోపు పాఠశాలలు మాత్రమే ఒకే టీచర్‌తో నడిచాయి. 2024-25 విద్యా సంవత్సరం నాటికి ఆ సంఖ్య 12,912కు చేరింది. ఆ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో 1,97,113 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అంటే సగటున ఒక్కో బడిలో ఉన్నది కేవలం 15 మంది. అదే రాష్ట్రం మొత్తం పరిశీలిస్తే 61,317 పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 84.54 లక్షల మంది విద్యార్థులు 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నారు. అంటే సగటున ఒక్కో పాఠశాల లేదా జూనియర్ కాలేజీలో 137.88 మంది ఉన్నారు. రాష్ట్ర సగటు 138 అయితే.. ఒకే టీచర్ ఉన్న పాఠశాలలో కేవలం 15 మంది విద్యార్థులే ఉన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన యూడైస్ నివేదికను కేంద్ర విద్యా శాఖ ఇటీవల విడుదల చేసింది. 2024-25లో ఒక్క పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. పది మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలు 9.8 శాతం, 11 నుంచి 20 మంది ఉన్నవి 12.9 శాతం, 21 నుంచి 30 మంది ఉన్నవి 15.8 శాతం, 101 నుంచి 200 మంది ఉన్నవి 13.7 శాతం, 500 మందిపైగా ఉన్నవి 6.2 శాతం పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో మొత్తం 3,42,721 మంది టీచర్లు ఉన్నారు.
వైసీపీ పాపమే
వైసీపీ ప్రభుత్వంలో చేసిన అడ్డగోలు సంస్కరణల ఫలితంగానే రాష్ట్రంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు భారీగా పెరిగాయి. జీవో 117తో ప్రభుత్వ పాఠశాల విద్యను జగన్ ప్రభుత్వం నాశనం చేసింది. దాదాపు 4,500 పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతులను ఇతర పాఠశాలల్లో విలీనం చేసింది. దీంతో అక్కడ 3-5 తరగతులు చదివే విద్యార్థులు ప్రభుత్వ బడులు మానేసి సమీపంలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. దీనిపై అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డెక్కినా జగన్ ప్రభుత్వం విలీన ప్రక్రియ ఆపలేదు. పైగా మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చి ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ఇది ప్రాథమిక పాఠశాలలను తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించే తల్లిదండ్రుల సంఖ్య తగ్గింది. దీంతో అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20లోపు పడిపోయి ఏకోపాధ్యాయ పాఠశాలలు వేల సంఖ్యకు చేరాయి.










Comments