బుచ్చిబాబు పెద్ది లుక్‌తో ఢిల్లీలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీరంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తన నటనతో, వ్యక్తిత్వంతో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. చరణ్ చిరంజీవి పేరుకు ఎటువంటి డ్యామేజ్ రాకుండా, ఒకవైపు సినిమాలు చేస్తూనే వ్యక్తిగతంగా కూడా అభిమానులను, ఆత్మీయులను గెలుచుకున్నారు. సినిమాలు బాగుంటే అభిమానులు వస్తారు, కానీ వ్యక్తిత్వం బాగుంటేనే ఆత్మీయులు ఉంటారు.. వారికి హిట్టు, ప్లాపులతో సంబంధం ఉండదు. చరణ్ అది సాధించాడని చెప్పాలి.
భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా జరగనున్న ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అక్టోబర్ 2, 2025 సాయంత్రం 7 గంటలకు న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ చారిత్రక స్పోర్ట్స్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై లీగ్‌ను ప్రారంభించారు. ఈ లీగ్ అక్టోబర్ 12 వరకు జరగనుంది.
ఈ లీగ్ భారతదేశంలో ఇంతవరకు లేని విధంగా ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంట్ రూపంలో జరుగుతుంది. దేశంలోని అగ్రశ్రేణి ఆర్చర్లు, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లతో కలిసి పోటీపడతారు. మొత్తం ఆరు జట్లు ఈ లీగ్‌లో పాల్గొంటాయి. 36 మంది భారత రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు, అలాగే ప్రపంచ టాప్-10లో ఉన్నవారు సహా 12 మంది ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్లు కలిపి మొత్తం 48 మంది పాల్గొనబోతున్నారు. ప్రతి జట్టులో నలుగురు పురుషులు, నలుగురు మహిళలు సహా 8 మంది ఉంటారు.
ప్రపంచ ఆర్చరీ చరిత్రలోనే తొలిసారిగా, రికర్వ్, కాంపౌండ్ ఆర్చర్లు ఒకే జట్టుగా, ఫ్లడ్‌లైట్స్‌లో పోటీ పడే ప్రత్యేక ఫార్మాట్‌ను APLలో ప్రవేశపెడుతున్నారు. ఇది ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందించబడింది. ఈ లీగ్ ప్రారంభోత్సవానికి హాజరైన రామ్ చరణ్ అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాలో లాంగ్ హెయిర్‌తో, రస్టిక్ లుక్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అదే లుక్‌లో APL ఈవెంట్‌కు హాజరుకావడంతో, ఆ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్ రాకపోయినా, ఇలాంటి ఈవెంట్‌లలో అభిమాన హీరోను చూసే అవకాశం లభించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ వీడియోలు చూసి చాలామంది తన వ్యక్తిత్వం (ఆరా) గురించి కామెంట్లు చేస్తున్నారు.
అక్టోబర్ 2 నుంచి 12 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌కు వరల్డ్ ఆర్చరీ, వరల్డ్ ఆర్చరీ ఆసియా, భారత క్రీడా మంత్రిత్వ శాఖ మద్దతు తెలిపాయి. ఏదేమైనా, తమ అభిమాన హీరో ఒక దానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు అని తెలిసినప్పుడు ఫ్యాన్స్ తమ ఎడిట్స్‌తో సోషల్ మీడియాలో సిద్ధంగా ఉంటారు. చరణ్ లుక్, APL ప్రారంభోత్సవ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Comments