బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా!
పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకం ముగిసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఉదయం తన నివాసంలో అత్యవసరంగా క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించిన ఆయన, మంత్రివర్గాన్ని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. గవర్నర్ ఆయన రాజీనామాను ఆమోదించి, తదుపరి ఏర్పాట్లు జరిగే వరకు ఆ పదవిలో కొనసాగాలని కోరారు.
21 ఏళ్ల ప్రస్థానం..
సుమారు 21 ఏళ్ల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం సేవలు అందించిన నితీష్ కుమార్, 'సుశాసన్ బాబు'గా పేరు తెచ్చుకున్నారు. 2005లో తొలిసారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, అప్పటి నుండి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. పది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి భారత రాజకీయాల్లోనే సరికొత్త రికార్డు సృష్టించారు.
జాతీయ రాజకీయాల వైపు అడుగులు..
ఇటీవలే నితీష్ కుమార్ రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో, ఆయన తన దృష్టిని జాతీయ రాజకీయాలపై కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఇంతకాలం బీహార్ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇకపై కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రగతికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది" అని పేర్కొన్నారు.
నితీష్ రాజీనామాతో బీహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఆయన బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.










Comments