భద్రాద్రి రామయ్య సేవలో 225 జంటలు
భద్రాచలం : తమిళనాడు రాష్ట్రానికి చెందిన కించిత్ కారన్ ట్రస్టు భక్త బృందం శుక్రవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ట్రస్టు నిర్వాహకులు వేలుకుడి కృష్ణన్ ఆధ్వర్యంలో 1500 మందిభక్త బృందం పురుషోత్తముడు పేరుతో పిలువబడే క్షేత్రాలను సందర్శించే ప్రక్రియలో భాగంగా పురుషోత్తమ విద్యా యాత్రను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రస్టు సభ్యులు మంగళగిరి, సింహాచలం, శ్రీకూర్మం, పూరి, భద్రాచలం, అహోబిలం క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం వచ్చిన ట్రస్టు సభ్యులంతా ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం చిత్రకూట మండపంలో స్వామి వారి నిత్య కల్యాణం నిర్వహించగా.. 225 జంటలు కల్యాణంలో పాల్గొన్నాయి. ఇదిలా ఉండగా.. ట్రస్టు సభ్యులు తాము సందర్శించే క్షేత్రాల్లో భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగ పారాయణాన్ని నిర్వహిస్తుండడం విశేషం. ఇటీవల కాలంలో అత్యధికంగా నిత్య కల్యాణంలో పాల్గొన్న భక్తుల సంఖ్య ఇదే.
Comments