రెప్పపాటులో నలుగురు బలి
బాపట్ల : వారంతా ఒకే కుటుంబ సభ్యులు.. ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఉల్లాసంగా గడిపారు. అనంత రం సంతోషంగా తిరిగి వెళుతుండగా హఠాత్తుగా మృత్యువు లారీ రూపంలో ఎదురైంది. అర్ధరాత్రి వేళ జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న వీరి కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. అంతే.. రెప్పపాటులో ఘోరం జరిగింది. కారులో ఉన్న ఆరుగురిలో దంపతులతోపాటు, మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కర్లపాలేనికి చెందిన బేతాళం బలరామరాజు(65), ఆయన భార్య లక్ష్మి(60)తో పాటు గాదిరాజు పుష్పవతి(60), సమీప బంధువు విజయవాడకు చెందిన మదునూరి శ్రీనివాసరాజు(57), మరో ఇద్దరు చిన్నారులు ఆదివారం రాత్రి బాపట్ల రూరల్‌లో జరిగిన ఓ వేడుకల్లో పాల్గొన్నారు. తర్వాత అందరూ కారులో కర్లపాలేనికి తిరుగుపయనమవ్వగా శ్రీనివాసరాజు కారు నడుపుతున్నారు. అర్ధరాత్రి వేళ.. చీకట్లో కారు వేగంగా వెళుతూ కర్లపాలెం జాతీ య రహదారిపై లారీని ఢీకొంది. రెప్పపాటులో జరిగిన ప్రమాదంలో బలరామరాజు, లక్ష్మి, పుష్పవతి, శ్రీనివాసరాజు అక్కడిక్కడే మృతి చెం దారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోగా, ఇద్దరు చిన్నారులు గాదిరాజు జయంత్, వైష్ణవి మాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన అర్ధగంట వ్యవధిలో వెనుకనే ఇంకో కారులో వస్తున్న బలరామరాజు కుమార్తె, మరికొంత మంది బంధువులు ఈ ఘటనను చూసి నివ్వెరపోయారు. బాధితులందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక సమాచారం. ముదునూరి శ్రీనివాసరాజు స్వస్థలం విజయవాడ. మృతులంతా బాపట్ల ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్రవర్మ సమీప బంధువులని సమాచారం.
 
 
                     
                              
  








 
 
Comments