తెలుగు రాష్ట్రాల్లో 1.24 లక్షల కోట్ల ఆదాయ పన్ను వసూలు
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,322 కోట్ల ఆదాయ పన్ను(ఐటీ) వసూలైందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని తెలిపారు. బంజారాహిల్స్‌లోని మెహిదీ మంజిల్ సమావేశ హాలులో ఆయన మాట్లాడుతూ గత ఏడాది కంటే 2025-26 సంవత్సరంలో 3.4ు మేర ఆదాయ పన్ను వసూళ్ల వృద్ధి నమోదైందన్నారు. రూ.1.24 లక్షల కోట్లలో తెలంగాణ నుంచి రూ.1.06 లక్షల కోట్లకు పైగా వసూలైందని, ఏపీ నుంచి రూ.17 వేల కోట్లకు పైగా వసూలైందని వివరించారు. దేశమంతటా ఏప్రిల్ 1 నుంచి కొత్త ‘ఆదాయ పన్ను చట్టం-2025’ అమల్లోకి వచ్చిందని, కొత్త చట్టాన్ని మరింత సరళీకరించామని తెలిపారు. సామాన్యులు సైతం అర్థం చేసుకునేలా ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడి పెరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. పన్ను బకాయిల గురించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వంటి ప్రజాప్రతినిధులకు పంపుతున్న నోటీసులపై స్పందిస్తూ... వారు గడువులోగా పన్ను చెల్లించేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పన్ను పరిధిలోకి రాకుండా తప్పించుకుంటున్న బ్యూరోక్రాట్లు, వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామికవేత్తల విషయంలో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ట్రాకింగ్ సిస్టం పని చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా రూ.11 వేల కోట్ల పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు.
పన్ను చెల్లింపుదారుల అనుకూల చట్టం: సంజయ్ బహదూర్
కొత్తగా తీసుకొచ్చిన ఆదాయ పన్ను చట్టం-2025 పన్ను చెల్లింపుదారులు, అధికారులు, చార్టెర్డ్ అకౌంటెంట్లకు అనుకూలంగా ఉందని, ప్రతి సెక్షన్‌ను అర్థమయ్యేలా తయారు చేశామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) సభ్యుడు సంజయ్ బహదూర్ చెప్పారు. చట్టంపై అవగాహన కల్పించేందుకు మెహిదీ మంజిల్ సమావేశ హాలులో ‘ప్రారంభ్’ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఊపు ఇవ్వనుందన్నారు.










Comments